
సంక్షేమ హాస్టళ్లలో ఉన్నత ప్రమాణాలు
మంత్రి డోలా ఆదేశం
కొమ్మాది: సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చేరుతున్న విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారం, విద్య అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. రుషికొండ దరి గీతం వర్సిటీలో ఉమ్మడి ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు, అధికారులతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. హాస్టళ్లలో సీట్ల భర్తీ, టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణత, హాస్టల్ భవనాల మరమ్మతులు, డైట్ బిల్లుల చెల్లింపు, పారిశుధ్య నిర్వహణ, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, వసతి తదితర అంశాలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్యవేణి, కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌లతో కలసి జిల్లాల వారీగా సమీక్షించారు. గత ఏడాది నీట్‌లో స్వల్ప తేడాతో సీట్లు పొందలేకపోయిన ఎస్సీ విద్యార్థుల కోసం లాంగ్ టెర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. హాస్టల్‌లో విద్యార్థులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలు చేయించాలన్నారు. హాస్టళ్ల అభివృద్ధిలో భాగంగా రూ.100 కోట్లతో 29 నూతన భవనాలు, రూ.58 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. విశాఖ జిల్లా ఉపసంచాలకుడు కె.రామారావు, డీడీ లక్ష్మీసుధ తదితరులు పాల్గొన్నారు.
నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ తరగతులు
పీఎంపాలెం: రాష్ట్ర ప్రభుత్వం, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సోమవారం ప్రారంభించారు. పరదేశిపాలెం సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 8 నెలల పాటు ఈ ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నెలకు రూ. 2.5లక్షల వేతనంతో జర్మనీలో నర్సింగ్ ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. మొదటి దశలో 75 మందికి అవకాశం ఉండగా, ప్రాథమికంగా ఆసక్తి చూపిన 29 మంది అభ్యర్థులు శిక్షణ తీసుకుంటున్నారని చెప్పారు.సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.నాయక్, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు.