
కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం కొత్త బార్ పాలసీ ప్రకారం జిల్లాకు మొత్తం 131 బార్లను కేటాయించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్రమూర్తి తెలిపారు. సోమవారం వీఎంఆర్డీఏ భవనంలోని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెలాఖరుతో ప్రస్తుతం నడుస్తున్న బార్ల లైసెన్సులు ముగుస్తాయని చెప్పారు. కొత్తగా కేటాయించిన 131 బార్లలో.. 121 సాధారణ కేటగిరీకి, 10 గీత కులాలకు కేటాయించినట్లు వివరించారు. కొత్త బార్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైందన్నారు. జనరల్ కేటగిరీ బార్లకు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లేదా హైబ్రిడ్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆఫ్‌లైన్ దరఖాస్తులను వీఎంఆర్డీఏ భవనం (సిరిపురం)లోని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నేరుగా సమర్పించాలని, ఈ నెల 28న వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ థియేటర్‌లో డ్రా ద్వారా బార్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. దరఖాస్తుతో పాటు తిరిగి చెల్లించని(నాన్–రిఫండబుల్) ధరావత్తు సొమ్ముగా రూ.5 లక్షలు, అప్లికేషన్ ఫీజు రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక్కో బార్‌కు కనీసం 4 దరఖాస్తులు వస్తేనే డ్రా తీస్తామని, లేకపోతే ఆ బార్‌కు డ్రా ఉండదని స్పష్టం చేశారు. బార్ లైసెన్స్ కోసం 50 వేలు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, రూ.5 లక్షలు దాటితే రూ.75 లక్షలు చెల్లించాలని చెప్పారు. లైసెన్సు ఫీజును ఒకేసారి కాకుండా ఆరు విడతల్లో చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లు తెలిపారు.
గీత కార్మికులకు 50 శాతం రాయితీ: గీత కార్మికులకు 10 బార్లను కేటాయించినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ తెలిపారు. ఇందులో శెట్టిబలిజలకు 6, యాతలకు 4 బార్లను లాటరీ ద్వారా కేటాయించినట్లు చెప్పారు. ఈ బార్లకు ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఈ నెల 29 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 30న డ్రా తీస్తామన్నారు. గీత కార్మికులకు లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఉంటుందని, ఒకరు ఎన్ని బార్లకై నా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. కాగా.. కొత్త బార్ పాలసీ ప్రకారం కొత్త బార్లకు మాత్రం ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు అనుమతి ఇచ్చారు. ఈ బార్లలో రూ.99 ధర కలిగిన చౌక మద్యం సరఫరా ఉండదని సూపరింటెండెంట్ తెలిపారు.
గీత కులాలకు 10 బార్లు : గీత కులంలోని ఉపకులాలకు 10 మద్యం బార్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ లాటరీ తీశారు.