
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పాపం కూటమిదే..
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ పాపం కూటమి ప్రభుత్వానిదేనని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించనివ్వబోమని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ఆ హామీని విస్మరించి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది త్యాగ ఫలమే విశాఖ స్టీల్ ప్లాంట్ అని కేకే రాజు గుర్తుచేశారు. అలాంటి పరిశ్రమలోని 32 విభాగాలను ప్రైవేటీకరించేందుకు టెండర్లు పిలవడం ఉక్కు కార్మికులను మోసం చేయడమేనని అన్నారు. కూటమి పార్టీలకు ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయమని గతంలోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను హెచ్చరించారని తెలిపారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు, ఉత్తరాంధ్ర ప్రజలు చేసిన పోరాటానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క కార్మికుడిని కూడా తొలగించలేదని, పైగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్టీల్ ప్లాంట్ రుణాలను ఈక్విటీగా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాశారన్నారు. ఆనాడు పోరాటం చేసిన కార్మికులపై ఎలాంటి కేసులు పెట్టలేదని, ఉద్యోగులను తొలగించలేదని స్పష్టం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారని, ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న 1,590 మందిని రెడ్‌మార్క్ చేసి, భవిష్యత్తులో ఉద్యమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. కూర్మన్నపాలెంలో 1,300 రోజులుగా కార్మికులకు దీక్షకు వేదికగా నిలిచిన టెంట్‌ను కూడా ప్రభుత్వం తొలగించిందని, ఆందోళనలకు ఆస్కారం లేకుండా అక్కడే పోలీసును కూడా ఏర్పాటు చేసిందని విమర్శించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, కార్మిక సంఘాలు, ప్రజలతో కలిసి వైఎస్సార్ సీపీ మరోసారి ఉద్యమిస్తుందని హెచ్చరించారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.