
స్టీల్‌ప్లాంట్ డీజీఎం ఇంట్లో చోరీ
పెదగంట్యాడ: స్టీల్‌ప్లాంట్ డీజీఎం ఇంట్లో చోరీ చేసిన నిందితుడిని 24 గంటల్లో పట్టుకున్నామని డీసీపీ లతామాధురి చెప్పారు. గాజువాక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్టీల్‌ప్లాంట్ సెక్టార్–6, క్వార్టర్ నెం.105–బిలో స్టీల్‌ప్లాంట్ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ డీజీఎం నల్లి సుందరం కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఈ నెల 16న ఆయన తన భార్యతో కలసి మధ్యాహ్నం 12.15 గంటలకు ఒక ఫంక్షన్ వెళ్లారు. తిరిగి 1.50 గంటలకు ఇంటికి వచ్చారు. మెయిన్ డోర్, ఫస్ట్ ఫ్లోర్ డోర్ తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా లాకర్ కూడా విరగ్గొట్టి ఉండడంతో అందులో ఉన్న 24 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్టీల్‌ప్లాంట్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సవాల్‌గా తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీ కె.లతామాధురి ఆదేశాల మేరకు సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఈ బృందం సాంకేతిక ఆధారాలతో కేవలం 24 గంటల్లోనే నిందితుడు మాటూరి శ్రీను(30)ను అరెస్టు చేసింది.
చోరీ సొత్తు రికవరీ : నిందితుడి నుంచి పోలీసులు బంగారు గాజులు పది, బ్రేస్‌లెట్లు నాలుగు, చెవులీలు 23 జతలు, ఒక చెయిన్, నాలుగు జతల చెవి దిద్దులు, ఆరు ఉంగరాలు, మూడు లాకెట్స్, నల్లపూసల దండ ఒకటి కలిపి మొత్తం 24 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. నిందితుడి నుంచి మోటర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మాటూరి శ్రీను పాత నేరస్తుడని డీసీపీ లతామాధురి తెలిపారు. అగనంపూడి ఉప్పర కాలనీకి చెందిన శ్రీనుపై 2021లో అచ్యుతాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనం కేసు ఉందన్నారు. ప్రస్తుతం నిందితుడు శ్రీకాకుళం జిల్లా బూర్జలోని అత్తారింట్లో ఉంటూ కొబ్బరికాయలు దింపే పని చేస్తున్నాడని పేర్కొన్నారు. చెడు అలవాట్లకు బానిస కావడంతో చోరీలు చేస్తున్నట్లు తెలిపారు.
24 గంటల్లోనే నిందితుడి అరెస్టు