
రేకుల షెడ్డు కూలి వృద్ధురాలి మృతి
నేడు పాఠశాలలకు సెలవు
కొమ్మాది: కాపులుప్పాడలోని రెడ్డిల పాలెంలో రేకుల షెడ్డు కూలి పాల సింహాచలం (75) అనే వృద్ధురాలు మృతి చెందారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు షెడ్డు గోడలు తడిసిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం ఆమె కోళ్ల షెడ్డుకు వెళ్లగా ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనపై భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్, కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు, స్థానిక నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
ఆరిలోవ: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు కారణంగా సోమవారం జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరిందిర ప్రసాద్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల రక్షణ, భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాలన్నారు.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు వర్షం అంతరాయం
విశాఖ స్పోర్ట్స్ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించింది. రాయలసీమ రాయల్స్, కాకినాడ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ 69 పరుగులు చేసింది. 70 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ రాయల్స్ 68 పరుగులే చేయగలిగింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా, ధృవ్ కుమార్ (32) ఒక పరుగు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. దీంతో కాకినాడ కింగ్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అదేవిధంగా సింహాద్రి వైజాగ్ లయన్స్, భీమవరం బుల్స్ మధ్య జరగాల్సిన రెండో మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.