
ఐవీఎఫ్ కేంద్రాల్లో వైద్య ఆరోగ్యశాఖ తనిఖీలు
మహారాణిపేట: నగరంలోని ‘సృష్టి’ ఐవీఎఫ్ సెంటర్‌లో అక్రమాలు బయటపడిన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లాలో ఉన్న ఐవీఎఫ్, సరోగసీ సెంటర్లపై తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి. జగదీశ్వరరావు ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు 53 సెంటర్లలో 32 కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగుచూశాయి. డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన డాక్టర్ ఉమావతి, డాక్టర్ సమత, డాక్టర్ లూసీ తదితరులు వేర్వేరు బృందాలుగా ఏర్పాటు ఈ సెంటర్లు తనిఖీలను ముమ్మరం చేశారు. చాలా కేంద్రాలు సేవలకు సంబంధించి సరైన రసీదులు ఇవ్వడం లేదని, నగదు లావాదేవీలను పుస్తకాల్లో నమోదు చేయడం లేదని అధికారులు గుర్తించారు.కొన్ని సెంటర్లు 100శాతం గ్యారెంటీ, ‘పిల్లలు పుట్టకపోతే డబ్బులు తిరిగి ఇస్తాం’ వంటి ప్రకటనలతో నిస్సహాయ మహిళలను ఆకర్షించి, వారి నుంచి రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తనిఖీల్లో తేలింది. ఈ దారుణమైన దోపిడీని అరికట్టేందుకు, ప్రతి సెంటర్‌లో చార్జీల వివరాలను తప్పనిసరిగా బోర్డుపై ప్రదర్శించాలని డాక్టర్ జగదీశ్వరరావు ఆదేశించారు. మిగిలిన కేంద్రాలను కూడా త్వరలో తనిఖీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.