
ఉన్మాదుల్లా టీడీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యేలు మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, వారి వేధింపులకు భయపడి మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మరికొందరు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి, దళిత మహిళా నేత మంచా నాగ మల్లేశ్వరి మండిపడ్డారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు లైంగికంగా వేధిస్తున్నారని, పనులు కావాలంటే పక్కన పడుకోవాలని మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒక దళిత మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించారని, అందరి ముందు అవమానించారని ఆమె అన్నారు. మరో టీడీపీ ఎమ్మెల్యే నజీర్ కారణంగా ఒక మహిళ ఆత్మహత్య చేసుకుందని, ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపులకు భయపడి ఒక మహిళ రాష్ట్రం విడిచి వెళ్లిపోయిందని ఆమె పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం టీడీపీ ఎమ్మెల్యే రాజు తన పార్టీ నాయకుడు చెప్పిన వారికి సీటు ఇవ్వలేదనే కారణంతో ఒక మహిళా ఉద్యోగినిని అందరి ముందు బండ బూతులు తిట్టారని, దాంతో ఆమె స్పృహ కోల్పోయి పడిపోయారని తెలిపారు. ఇలా ప్రజా ప్రతినిధులే మహిళలను వేధిస్తుంటే, ఆ పార్టీలోని నాయకులు, కార్యకర్తలు మరింతగా అఘాయిత్యాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దళిత మహిళలపై దాడులు, వేధింపులు జరుగుతున్నా దళిత హోంమంత్రి వంగలపూడి అనిత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఆ కామ పిశాచులను అరెస్ట్ చేయడం లేదని ఆమె ఆరోపించారు. అనంతపురంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై 14 మంది టీడీపీ కార్యకర్తలు లైంగికదాడికిపాల్పడి హత్య చేస్తే, వారిపై చర్యలు లేవని, కనీసం హోంమంత్రి బాధిత మహిళ కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. ఇలాంటి చేతగాని హోంమంత్రి అనిత ఆ పదవికి అనర్హురాలని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడిన టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా దళితులంతా ఉద్యమిస్తామని నాగమల్లేశ్వరి హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి
మంచా నాగ మల్లేశ్వరి ఆగ్రహం