
ఈసీ లీలలపై విస్మయం
వయసు 56 ఏళ్లు... పుట్టింది మాత్రం
1800 సంవత్సరంలో అని నమోదు
అగనంపూడి : భారత ఎన్నికల సంఘం (ఈసీ) నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ‘ఇప్పటికింకా నా వయసు నిండి పదహారేళ్లే’ అన్నట్టుగా, 56 ఏళ్ల వయసున్న ఒక ఓటరు వయసును 225 సంవత్సరాలుగా నమోదు చేసింది. ఈ ఘటనపై సామాజిక కార్యకర్త పట్టా రామ అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం అగనంపూడి నిర్వాసిత కాలనీ కొండయ్యవలసకు చెందిన తన సోదరుడు 1969లో జన్మించారని, ఆయన వయసు 56 ఏళ్లు నిండిందని రామ అప్పారావు తెలిపారు. అయితే ఆయన ఓటరు కార్డులో మాత్రం పుట్టిన తేదీ 01.01.1800గా నమోదై ఉండడం చూసి విస్మయం వ్యక్తం చేశారు. ‘ఇంత గుడ్డిగా ఓటరు నమోదు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఎలా నమోదవుతున్నాయో కూడా అర్థం కావడం లేదని రామ అప్పారావు పేర్కొన్నారు. బ్యాంక్ లావాదేవీలకు ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఓటరు నమోదు విషయంలో ఎందుకు ఆధార్‌ను అనుసంధానం చేయలేకపోతున్నాయో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఈసీ నిర్లక్ష్యానికి, డొల్లతనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
పుట్టిన తేదీ 1800గా నమోదైన
పట్టా రమణ ఓటరు కార్డు

ఈసీ లీలలపై విస్మయం