
గంజాయి తరలిస్తున్న కారు డ్రైవర్‌కు రిమాండ్
ఏడాదిన్నర బాలుడి మృతికి ఇతనే కారణం
మర్రిపాలెం: ఊర్వశి జంక్షన్ సమీపంలో ఈ నెల 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఏడాదిన్నర వయసున్న వర్షిత్ అనే బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నెల 16న కంచరపాలెం ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీనివాసరావు కారును తనిఖీ చేయగా.. అందులో 21 కిలోల గంజాయి లభించింది. దీంతో పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ఆదివారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలివి. తమిళనాడుకు చెందిన అర్జునన్ జెమినీ అధ్ముఘం ఈ నెల 12న విజయవాడలో ఒక ప్రైవేట్ సంస్థ నుంచి ఆన్‌లైన్ ద్వారా కారును అద్దెకు తీసుకున్నాడు. ఆ కారులో అతను అరకు వెళ్లి సుమారు 21 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. గంజాయితో ఎన్‌ఏడీ కొత్తరోడ్డు మీదుగా విశాఖ రైల్వే స్టేషన్ వైపు వస్తున్న క్రమంలో.. ఊర్వశి జంక్షన్ బీఆర్టీఎస్ రహదారిపై రోడ్డు దాటుతున్న దంపతులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు వర్షిత్ గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో కంచరపాలెం పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు కారు తాళాలు కనిపించకపోవడంతో.. ట్రాఫిక్ పోలీసులు డూప్లికేట్ తాళాలను తెప్పించి కారును తనిఖీ చేశారు. కారు వెనుక డిక్కీలో 21 కిలోల గంజాయిని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే కంచరపాలెం శాంతి భద్రతల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అర్జునన్‌ను విచారించి రిమాండ్‌కు తరలించారు. గంజాయి వ్యవహారంలో అతనికి ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు.