
నేవీ నిఘా వ్యవస్థలో ఏఐ వినియోగం
సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఏడాది ఫిబ్రవరి.. భారత నౌకాదళానికి పండగలా మారనుందని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ అన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో ఈఎన్‌సీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్లాటూన్‌లు, నౌకాదళ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్స్, వివిధ నౌకల సిబ్బంది మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ నగరం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలన్–2026 విన్యాసాలు, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియంకు ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన మిలన్ విన్యాసాల్లో ఇది అతి పెద్దదిగా నిలవనుందని.. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ప్రయోజనాలను కాపాడే దేశాల్లో భారత్ ముందుందని వెల్లడించారు. ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యంలో భాగంగా.. దేశీయ షిప్‌యార్డుల్లో 60కి పైగా యుద్ధ నౌకలు, సబ్‌మైరెన్‌ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ నెల 26న విశాఖలో ఐఎన్‌ఎస్ ఉదయగిరి, ఐఎన్‌ఎస్ హిమగిరి యుద్ధ నౌకలను నేవీ అమ్ములపొదిలో చేరనున్నాయని వివరించారు. అలాగే ఈ ఏడాది చివరలో మరో రెండు యాంటీ సబ్‌మైరెన్ వార్‌షిప్‌లు జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. ఐఎన్‌హెచ్‌ఎస్ కల్యాణి ఆసుపత్రిని పూర్తిస్థాయి కమాండ్ ఆసుపత్రిగా ఆధునికీకరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సముద్ర భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి నిఘా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడుతున్నామని ఈఎన్‌సీ చీఫ్ తెలిపారు. మానవరహిత ఉపరితల, నీటి అడుగున పోరాడే వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్స్, నేవీ అప్‌గ్రేడ్ అయిందన్నారు. ఈఎన్‌సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా పాల్గొన్నారు.