
నాణ్యతతో నిరంతర విద్యుత్ సరఫరా
సీతంపేట: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి జాతీయ జెండాను ఎగురవేశారు. సంస్థ పరిధిలో 73 లక్షల వినియోగదారులకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిరంతరాయ విద్యుత్ సేవలందిస్తూ.. ప్రసార పంపిణీ నష్టాలను 5.8 శాతం కంటే తక్కువకు తగ్గించినట్లు తెలిపారు. పీవీటీజీ గిరిజన ఆవాసాల్లో 23,024 ఇళ్లకు, డీఏ–జేజీయూఏ పథకంలో 1979 ఇళ్లకు, అలాగే 13 వేలు ఇళ్లకు నాన్ పీవీటీజీ విద్యుత్ సదుపాయం కల్పించామన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద 19,385 గృహాలపై 63,522 మెగావాట్ల సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్‌డీఎస్‌ఎస్ పథకంలో భాగంగా 3004 కోట్లతో గ్రామీణ ప్రాంతాలకు నిరంతర త్రీ ఫేజ్ సరఫరా కోసం కొత్త ఫీడర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 97 మంది ఉద్యోగులకు సీఎండీ ప్రశంసాపత్రాలు అందజేశారు. సంస్థ డైరెక్టర్లు డి.చంద్రం, టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, సీజీఎంలు డి.సుమన్ కల్యాణి, వి. విజయలలిత, అచ్చి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.