
అరిగిన చక్రాలు.. ఆగిన సేవలు
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు బ్రేకులు
23 వాహనాల్లో మూలకు చేరినవి 8
మరమ్మతులతో షోరూమ్‌ల్లో మరో 5
మూడు నెలలుగా
డ్రైవర్లకు అందని జీతాలు
మహారాణిపేట: గర్భిణులు, బాలింతలు, శిశువులను ఆస్పత్రులు, ఇళ్లకు చేర్చిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు నేడు దయనీయంగా మారాయి. ఈ వాహనాల నిర్వహణ దారుణంగా ఉంది. బ్యాటరీలు పని చేయక, టైర్లు అరిగిపోయి కదలడం లేదు. సరిపడే ఆయిల్ ఇవ్వకపోవడంతో వాహనాలను నడిపేందుకు డ్రైవర్లు వెనుకంజ వేస్తున్నారు. గత మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో వాహనాల కెప్టెన్లు అవస్థలు పడుతున్నారు. వాహనాలు రాకపోవడంతో కేజీహెచ్ గైనిక్ వార్డులో డిశ్చార్జి అయిన బాలింతలు, వారి కుటుంబ సభ్యులు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో బాలింతలను ఉచితంగా ఇళ్లకు క్షేమంగా పంపేవారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తల్లీబిడ్డ వాహనాలను గాలికి వదిలేశారు. వాహనాలు రిపేర్లు అయినా పట్టించుకోవడం లేదు.
ఒకే వాహనంలో ఇద్దరు
వాహనాల కృత్రిమ కొరత వల్ల ఇటీవల కేజీహెచ్ నుంచి ఒకే వాహనంలో ఇద్దరు బిడ్డలతో బాలింతలను తల్లీబిడ్డ వాహనాలు తరలించడంపై చర్చ సాగుతోంది. ఒకే వాహనంలో ఇలా తరలించడం వల్ల తల్లులు అవస్థలు పడుతున్నారు. ఒకే రూటు కనుక అలా తీసుకెళ్లామని డ్రైవర్లు చెప్పకొస్తున్నారు. గతంలో అయితే ఎప్పుడైనా బాలింతలను తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉండేవి. ఇప్పుడు వాహనాలు లేక.. డ్రైవర్లు కానరాక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
డ్రైవర్లకు ఆంక్షలు : తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లపై గతంలో కన్నా ఆంక్షలు ఎక్కువగా విధించారు. గతంలో నెలకు రూ.30 వేలు ఆయిల్ కోసం ఇచ్చేవారు. ఇప్పుడు నెలకు రూ.8 వేలతో సరిపెట్టుకోవాలని సూచిస్తున్నారు. యాజమాన్యం వల్ల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉంది. ఆయిల్ ఇవ్వడం లేదని, ఇచ్చిన ఆయిల్‌తోనే పనిచేయాలని డ్రైవర్లపై ఒత్తిడి చేస్తున్నారు. పనిచేయకపోతే వేధింపులకు గురి చేస్తున్నారని పలువురు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు.