
అంతర్జాతీయ నగరంగా విశాఖ
సంక్షేమంతో పాటు అభివృద్ధే లక్ష్యం
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని
రూ.214.99 కోట్ల
నగదు ప్రోత్సాహకాల పంపిణీ
విశాఖ సిటీ/బీచ్‌రోడ్డు: విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చిలతో కలిసి మంత్రి ఓపెన్ టాప్ వాహనంలో పరేడ్ మైదానాన్ని సందర్శించారు. పరేడ్ కమాండర్ విజయ్ కుమార్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు కవాతు నిర్వహించారు. జాతి సమైక్యతను చాటి చెబుతూ త్రివర్ణ పతాక రంగుల్లో ఉన్న బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ ప్రగతి గురించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌తో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టేలా చేశారని, ఈ ఏడాదిలోనే రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని మంత్రి వివరించారు. విశాఖను ఐటీ, డేటా హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ క్రమంలో గూగుల్ సంస్థ ఆరు బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని, టీసీఎస్ సంస్థ రూ.1,370 కోట్లతో 12,000 ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. కాగ్నిజెంట్ సంస్థ కూడా రూ.1,583 కోట్లతో కొత్త క్యాంపస్‌ను నిర్మించనుందని, అలాగే ఏఎన్‌ఎస్‌ఆర్ గ్రూప్ రూ.1,000 కోట్లతో, సత్వా గ్రూప్ రూ.1,500 కోట్లతో తమ సంస్థలను ఏర్పాటు చేస్తాయని వెల్లడించారు.
భూ పరిపాలన సంస్కరణలు
భూ పరిపాలన అంశాల్లో సంస్కరణల కోసం తనతో పాటు మరో ఐదుగురు మంత్రులతో కూడిన జీవోఎంను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించిన నాలా చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ వ్యవహారంపై పరిశీలన చేసి, నిరుపేదలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లోని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించడానికి జీవో నంబర్ 30ని జారీ చేసినట్లు వివరించారు
ప్రత్యేక స్టాళ్లు.. నగదు ప్రోత్సాహకాలు
హర్ ఘర్ తిరంగా అనే అంశంపై సమాచార శాఖతో పాటు పలు శాఖలు సంక్షేమ పథకాలను వివరిస్తూ స్టాళ్లు ఏర్పాటు చేశాయి. వీటిని కలెక్టర్, జేసీ ఇతర అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వివిధ సంక్షేమ పథకాల కింద రూ.214.99 కోట్ల నగదు ప్రోత్సాహకాలను లబ్ధిదారులకు అందజేశారు. విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్టుకుమార్ రాజు, న్యాయ, పోలీస్, రెవెన్యూ అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
స్నాక్స్‌తో కడుపు నొప్పి
వేడుకల సందర్భంగా మీడియా ప్రతినిధులు, అధికారులు, ప్రేక్షకులకు పంపిణీ చేసిన స్నాక్స్ అస్వస్థతకు కారణమయ్యాయి. పంపిణీ చేసిన ఒక్కో కచోరీ నాసిరకంగా ఉండటంతో వాటిని తిన్న చాలా మందికి కడుపునొప్పి వచ్చింది. ఈ విషయంపై జర్నలిస్టు సంఘం నాయకుడు నారాయణ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

అంతర్జాతీయ నగరంగా విశాఖ

అంతర్జాతీయ నగరంగా విశాఖ

అంతర్జాతీయ నగరంగా విశాఖ