
‘సీ్త్ర శక్తి’ మహిళల స్వేచ్ఛా విహంగానికి దోహదం
రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్
మద్దిలపాలెం : సీ్త్ర శక్తి పథకం మహిళల స్వేచ్ఛా విహంగానికి ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సీ్త్ర శక్తి పథకాన్ని ఆయన మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో వివిధ ప్రాంతాలకు ప్రయాణించే పలువురు మహిళలకు జీరో ఫేర్ టికెట్లను అందజేశారు. అనంతరం ఎండాడ వరకు సిటీ బస్సులో ప్రయాణించారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి ఐదు రకాల సర్వీసుల్లో మహిళలు ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు రూ.2000 నుంచి 3000 వరకు ఆర్థికభారం తగ్గుతుందన్నారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ జిల్లాలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీ అధికారులు 576 బస్సులు సిద్ధం చేశారని చెప్పారు. కలెక్టర్ ఎం.ఎం.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ సీ్త్ర శక్తి పథకం రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుక అందించిందన్నారు. పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ ఉచిత బస్సు మహిళల ఆర్థికాభివద్ధికి బాటలు వేస్తుందన్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, పార్టీ నేతలు గండి బాబ్జీ, దువ్వారపు రామారావు, సీతంరాజు సుధాకర్, ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.