
దేశభక్తిని చాటిన ప్రదర్శనలు
వేడుకల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జ్ఞానాపురం సేక్రెడ్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులు దేశమంటే.. దేశమంటే.. మతం కాదోయ్ అనే గేయ నృత్య ప్రదర్శనతో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. భరతమాత బిడ్డలురా.. బోర్డర్‌లో ఒరిగెనురా అంటూ నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా అంటూ పద్మనాభం కేజీబీవీ విద్యార్థులు, భారతీయ సమరస భావన థీమ్‌తో తగరపువలస కేథరిన్ పాఠశాల విద్యార్థులు, వందేమాతర.. సుందర భారతం.. అంటూ పెందుర్తి ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఏతో.. కాశ్మీర్.. హై.. అంటూ విశాఖ వ్యాలీ విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు. విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.