
సింహగిరిపై రూ.3 కోట్లతో శాశ్వత షెడ్
నిర్మాణానికి విరాళం అందించిన
డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న శాశ్వత షెడ్‌కు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం శంకుస్థాపన చేశారు. విజయవాడకు చెందిన దాత డాక్టర్ బొప్పన ఝాన్సీలక్ష్మీబాయి(శ్రీ వైభవి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్) ఈ నిర్మాణానికి విరాళం అందించారు. ఆలయ ఉత్తర రాజగోపురం ఎదుట 30 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో నిర్మించే ఈ టెన్సిల్ మెంబ్రేన్ షెడ్.. భక్తులను ఎండ, వానల నుంచి రక్షించడంతో పాటు వారికి విశ్రాంతి స్థలంగా ఉపయోగపడుతుందని గంటా అన్నారు. ఉత్సవాల సమయంలో తాత్కాలిక షెడ్ లతో భక్తులు పడుతున్న ఇబ్బందులకు ఈ నిర్మాణంతో తెర పడుతుందన్నారు. ఈ సందర్భంగా దాతను అభినందించారు. సింహాచలం దేవస్థానానికి త్వర లోనే పాలకమండలిని ఏర్పాటు చేస్తామని గంటా వెల్లడించారు. తిరుమల తరహాలో సింహగిరిపై కూడా దాతల సహకారంతో కాటేజీలు నిర్మించి, వసతి సౌకర్యాలు మెరుగుపరచాలని ముఖ్యమంత్రిని కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. కొండపై జీఆర్టీ జ్యూయలర్స్ ఏర్పాటు చేసిన శంఖుచక్ర నామాల పక్కనే ఆ సంస్థ పేరును ప్రదర్శించడంపై గంటా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భగవంతుడి నామాల వద్ద కంపెనీ పేరు కనిపించడం సరికాదన్నారు. ఆ పేరును వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో మొత్తం నిర్మాణాన్ని తీసివేసి కొత్తగా నామాలను ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు జీఆర్టీ పేరుకు ఉన్న విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో వి.త్రినాథరావు, దాత బంధువులు, కార్పొరేటర్ పి.వి.నరసింహం పాల్గొన్నారు.