ఎత్తివేస్తాం! | - | Sakshi
Sakshi News home page

ఎత్తివేస్తాం!

Aug 11 2025 7:29 AM | Updated on Aug 11 2025 7:37 AM

చిట్‌కెలో నిషేధం
● రంగంలోకి చిట్స్‌ వ్యాపారి ● 22–ఏ జాబితాలోని భూములపై కన్ను ● హైదరాబాద్‌ కేంద్రంగా వ్యవహారం ● ఇప్పటికే 6 ఎకరాలకుపైగా భూములపై నిషేధం ఎత్తివేత ● ఆయన చేతిలో మరో 15 భూదస్త్రాలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

త్యంత విలువైన భూములున్న విశాఖ కేంద్రంగా అధికార పార్టీకి చెందిన నేతలు గద్దల్లా వాలుతున్నారు. ఇప్పటికే ఎండాడలోని విలువైన 5.10 ఎకరాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయించుకున్న అధికార పార్టీ నేతలు.. ఇతర భూములపైనా కన్నేసినట్టు తెలుస్తోంది. ఎలాంటి భూములనైనా నిషేధం ఎత్తివేయించి.. విక్రయించుకునేందుకువీలుగా చేస్తామంటూ బేరసారాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో విశాఖలో ఏకంగా కోటి రూపాయల మోడల్‌ చిట్‌ను ప్రారంభించి ఒక వెలుగు వెలిగిన చిట్‌ కంపెనీకి చెందిన సోదరుడే ఇప్పుడు ఈ భూవ్యవహారాలను చక్కబెట్టేందుకు రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. చిట్‌ వ్యాపారి మరణించిన తరువాత హైదరాబాద్‌కు వెళ్లిన ఆ వ్యాపారి సోదరుడు అక్కడ నుంచే వ్యవహారాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు విశాఖలోని పాత నగరంలో ఒక ప్రముఖ హోటల్‌లో తిష్టవేసినట్లు భోగట్టా. ఇందులో భాగంగా ఇప్పటికే మాజీ సైనికులకు చెందిన ఆరు ఎకరాలకుపైగా భూములపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయించి 22–ఏ జాబితా నుంచి తొలగించేలా ఆదేశాలు తెచ్చినట్టు సమాచారం. అయితే, ఈ చిట్‌ వ్యాపారి వెనుక ఉండి వ్యవహారాలు నడిపిస్తున్న పెద్దలు ఎవరనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

సచివాలయం వైపు తొంగి చూడొద్దు!

మరోవైపు ఇప్పటికే ఎండాడ భూమి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ పెద్దలు మరిన్ని భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కార్యక్రమం మాత్రం యథావిధిగా నడిపిస్తున్నారు. అయితే, దక్షిణ నియోజకవర్గానికి చెందిన నేతపై మాత్రం కూటమి ఎమ్మెల్యేలు లోలోన రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలోని తన పేషీ వైపు మాత్రం కొద్ది రోజులు రావద్దంటూ ఒక అమాత్యుడు సదరు దక్షిణ నియోజకవర్గ నేతకు సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సదరు నేత కాసింత జోరు తగ్గించినట్టు తెలుస్తోంది. మరోవైపు చిట్‌ వ్యాపారి తాజాగా దూకుడు పెంచడం చర్చనీయాంశమవుతోంది. అమాత్యుడితో సంబంధం లేకుండా నేరుగా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. అయితే, ఈ చిట్‌ వ్యాపారి వెనుక ఉండి వ్యవహారాలు నడుపుతున్న ప్రభుత్వ పెద్దలు ఎవరనేది మాత్రం తేలాల్సి ఉంది.

సిట్‌ జాబితాలోని భూములపైనా కన్ను

వాస్తవానికి విశాఖ నగరంలోని పలు విలువైన భూముల్లో అక్రమాలు జరుగుతున్నాయని 2014–19లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే అప్పటి మంత్రి అయ్యన్న ఆరోపణలు గుప్పించారు. ప్రధానంగా గంటా లక్ష్యంగా ఆయన పలు ఆరోపణలు చేశారు. ఫలితంగా విశాఖ భూ వ్యవహారాలపై తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేశారు. ఆ సిట్‌ తన నివేదికను కూడా 2017లో సమర్పించింది. ఈ నివేదికపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రధానంగా తమ పార్టీకి చెందిన నేతలతో పాటు మద్దతిచ్చే సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులు, సంస్థలు ఇందులో ఉండటమే కారణమనే విమర్శలున్నాయి. ప్రధానంగా ఫలానా భూములపై అనేక ఆరోపణలు ఉన్నాయని.. ఈ భూముల జోలికి వెళ్లవద్దనడంతో పాటు ఆ భూములకు నిరంభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) కూడా జారీ చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అటువంటి భూములకు కూడా ఎన్‌వోసీలు ఇప్పిస్తామంటూ ఇప్పుడు సదరు చిట్‌ వ్యాపారి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ విధంగా ఇప్పటికే సిట్‌ పరిధిలోకి 6 ఎకరాలకుపైగా భూమికి ఎన్‌వోసీ తెచ్చినట్టు కూడా సమాచారం. అంతేకాకుండా అత్యంత విలువైన ప్రాంతాల్లోని 15 కీలకమైన భూదస్త్రాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. వీటన్నింటికి ఎన్‌వోసీలు ఇప్పించి.. ప్రభుత్వ భూముల జాబితా నుంచి తొలగించేలా చేస్తానని కూడా చెబుతుండటం గమనార్హం. ఇప్పటికే ఎండాడ భూమి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ పెద్దలు ఏ మాత్రమూ తగ్గేదేలే అంటూ ముందుకెళుతుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement