స్టాండింగ్‌ షాక్‌! | - | Sakshi
Sakshi News home page

స్టాండింగ్‌ షాక్‌!

Aug 7 2025 11:05 AM | Updated on Aug 7 2025 11:05 AM

స్టాం

స్టాండింగ్‌ షాక్‌!

మేయర్‌పై వ్యతిరేకత.. కూటమి పార్టీలో లుకలుకలు హైకోర్టు కేసు నేపథ్యంలో వేటు భయం భారీగా జరిగిన క్రాస్‌ ఓటింగ్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/డాబాగార్డెన్స్‌ :

కూటమి పార్టీల్లో రోజురోజుకీ పెరుగుతున్న లుకలుకలు.. మేయర్‌ వ్యవహారశైలి పట్ల సొంత పార్టీ కార్పొరేటర్లల్లో వ్యతిరేకత.. పార్టీ మారిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు... వెరసి జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి సాడి పద్మారెడ్డి ఏకంగా 50 ఓట్లతో విజయం సాధించారు. మొత్తం 10 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలో చేరిన కార్పొరేటర్లతో పాటు కూటమిలోని మరికొందరు కార్పొరేటర్లు కూడా క్రాస్‌ ఓటింగ్‌కు దిగడంతో కూటమికి షాక్‌ తగిలింది. గత స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో మొత్తం 10 స్థానాల్లో విజయం సాధించిన కూటమికి ఈ దఫా జరిగిన ఎన్నికల్లో ఓ స్థానంలో ఓటమి తప్పలేదు. వాస్తవానికి సాధారణ ఎన్నికల తర్వాత కూటమి పార్టీల్లోకి పలువురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు జంప్‌ అయ్యారు. ఇక వైఎస్సార్‌ సీపీకి నికరంగా 32 మంది కార్పొరేటర్లు మిగిలారు. స్థాయీ సంఘం ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో ఉన్న 10 మంది అభ్యర్థులకు 32 కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి కూటమి పాలన పట్ల కార్పొరేటర్లలో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోంది.

కనీస గౌరవమేదీ..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవీఎంసీపై కన్నేశారు. గత ఏడాది జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో రిసార్టు రాజకీయాలు నడిపి.. ప్రతి ఒక్కరికీ ఒక్కో రకం పెన్సిల్‌ ఇచ్చి మరీ ఓటింగ్‌ జరిపారు. వైఎస్సార్‌ సీపీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లకు పలు ఆశలు చూపి తమ పార్టీలో చేర్చుకున్నారు. అయితే పార్టీ మారే వరకూ ఎంతో గౌరవంగా పలకరించి.. స్టాండింగ్‌ కమిటీతో పాటు మేయర్‌ ఎన్నికల అనంతరం కనీసం పట్టించుకోవడం మానేశారంటూ పలువురు కార్పొరేటర్లు వాపోతున్నారు. తమకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఇక పార్టీ మారిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై సమాధానం చెప్పాలంటూ కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. ఎక్కడ తమపై వేటు పడుతుందోనన్న ఆందోళనతో పార్టీ మారిన కార్పొరేటర్లు కొందరు వైఎస్సార్‌ సీపీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది.

కూటమి పార్టీల్లో పెరిగిన అంతరం!

స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీల మధ్య లుకలుకలు బయటపడ్డాయి. ఈ ఎన్నికల్లో జనసేనకు కనీసం 2 స్థానాలైనా ఇవ్వాలని కోరగా ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు. పోటీలో నిలిచిన కార్పొరేటర్‌ సాధిక్‌ను చివరిలో తప్పించారు. ఈ నేపథ్యంలో జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ ఏకంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. సీపీఎం కార్పొరేటర్‌ కూడా ఓటింగ్‌కు దూరంగా ఉంది. మరోవైపు టీడీపీ కూటమిలోని జనసేన, బీజేపీలను కలుపుకుని వెళ్లడం లేదన్న విమర్శలున్నాయి. కూటమిలోని లుకలుకలు కూడా ఈ ఫలితాలకు కారణమైనట్టు తెలుస్తోంది. అలాగే గత స్టాండింగ్‌ కమిటీ పేరుతో జరిపిన వసూళ్లలో జీవీఎంసీలో కీలక నేత పాత్రపైనా ఆరోపణలున్నాయి. స్టాండింగ్‌ కమిటీ పేరుతో నామినేషన్‌ పనుల్లో 10 శాతం వాటా అడిగి మరీ వసూలు చేయడంపై కాంట్రాక్టర్లల్లో వ్యతిరేకత ఉంది. వసూలు చేసిన మొత్తం కూడా కీలక నేతకు చేరిన తర్వాత పంపకాలు జరపడం... అదీ నామమాత్రంగా ఉండటం పట్ల కూడా గుర్రుగా ఉన్నారు. మొత్తంగా జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల ఫలితం కూటమి పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనంగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మేయర్‌పై గుర్రు

ప్రధానంగా మేయర్‌ పీఠం ఎక్కిన తర్వాత పీలా శ్రీనివాస్‌ వ్యవహరిస్తున్న తీరు పట్ల సొంత పార్టీ కార్పొరేటర్లలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనీస గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న తీరుతో పాటు వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏవీ జరగకపోవడం.. కేవలం ఆయన చుట్టూనే వ్యవహారాలన్నీ నడిపేందుకు ప్రయత్నించడంతో కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. కౌన్సిల్‌, స్టాండింగ్‌ కమిటీ సమావేశాల్లో చర్చ లేకుండా ఇష్టానుసారంగా ముందుకెళ్లారనే ఆగ్రహంతోనూ ఉన్నారు. మరోవైపు మేయర్‌కు, కూటమి పార్టీలోని ఎమ్మెల్యేల మధ్య సఖ్యత కూడా సరిగా ఉండడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. వారికి కనీస సమాచారం ఇవ్వకుండా వెళుతున్నారనే విమర్శలున్నాయి. మరోవైపు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీతో నేరుగా కయ్యానికి దిగడంతో వారి మధ్య మరింత దూరం పెరిగింది. మేయర్‌ ఎన్నిక వరకూ తమతో ఎంతో సఖ్యతగా ఉంటూ.. అన్న అన్న అని నక్కవినయం చూపించి తీరా గెలిచిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రధానంగా అందరిలోనూ వ్యతిరేకత నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది.

స్టాండింగ్‌ షాక్‌!1
1/3

స్టాండింగ్‌ షాక్‌!

స్టాండింగ్‌ షాక్‌!2
2/3

స్టాండింగ్‌ షాక్‌!

స్టాండింగ్‌ షాక్‌!3
3/3

స్టాండింగ్‌ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement