
జన విజ్ఞాన వేదికకు ఆధారం సైన్స్, రాజ్యాంగం
సీతంపేట: సైన్సు, రాజ్యాంగం ఆధారంగా జనవిజ్ఞాన వేదిక పనిచేస్తుందని సంస్థ జాతీయ అధ్యక్షుడు వి.బ్రహ్మారెడ్డి అన్నారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శుక్రవారం జరిగిన భావతరంగం వైజాగ్–2025 కార్యక్రమంలో దేశానికి కావలసిన న్యాయం, ఐక్యత అంశంపై ఆయన ప్రసంగించారు. జన విజ్ఞాన వేదిక ద్వారా సైన్స్‌ను వివిధ కళారూపాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. దేవుడు, కులం, మతం లేని సమాజం కోసం జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందన్నారు. నాగార్జున యూనివర్సిటీ పూర్వ వీసీ ఆచార్య వి.బాలమోహన్‌దాస్ ‘గాంధేయ వాదం రాజకీయ ప్రాముఖ్యత’పై మాట్లాడుతూ మహాత్మాగాంధీ భావాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. గాంధీజీ పాటించిన 18 గుణాలను వివరించారు. ఓపీఏసీ ఫౌండర్ దండి ప్రియాంక, లా యూనివర్సిటీ మాజీ వీసీ సత్యనారాయణ, నన్నయ యూనివర్సిటీ మాజీ వీసీ జార్జ్ విక్టర్, కృష్ణాజి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్, జిల్లా అధ్యక్షుడు విజయ్‌చందర్ పాల్గొన్నారు.