
‘మయామీ ఆఫ్ ది ఈస్ట్’గా విశాఖ
● థీమ్ నగరాల అభివృద్ధికి వీఎంఆర్‌డీఏ ప్రణాళికలు ● భీమిలి, శొంఠ్యాంతో పాటు మరో రెండు చోట్ల ప్రదేశాల గుర్తింపు ● పీపీపీ విధానంలో అభివృద్ధికి సన్నాహాలు
విశాఖ సిటీ: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో వినూత్న ప్రాజెక్టుల రూపకల్పనకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు విశాఖను ‘బే సిటీ’గా ‘మయామీ ఆఫ్ ది ఈస్ట్’గా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇందుకోసం థీమ్ నగరాల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చి ఆర్థిక ప్రోత్సహం అందించే దిశగా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో ప్రత్యేకంగా థీమ్ బేస్డ్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు ప్రాంతాలను గుర్తించగా.. మరో ప్రదేశాల గుర్తింపు తుది దశలో ఉంది. పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్‌షిప్(పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్టులను చేపట్టాలన్న ఆలోచనలో ఉంది.
నీతి ఆయోగ్ సిఫార్సులతో
విశాఖ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రధానంగా తీర ప్రాంతం అదనపు ఆకర్షణగా నీతి ఆయోగ్ గుర్తించింది. దీంతో విశాఖను ఫ్లోరిడాలోని మయామీ నగరాన్ని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఫార్సులు చేసింది. దీని ప్రకారం వీఎంఆర్‌డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి పట్టణ క్లస్టర్‌ను ఒక ప్రత్యేక థీమ్ ఆధారంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఐటీ–ఇన్నోవేషన్, హెల్త్–వెల్‌నెస్, నాలెడ్జ్–ఎడ్యుకేషన్, టూరిజం–కల్చర్, లాజిస్టిక్స్–ట్రేడ్, వంటి రంగాలు ఆధారంగా వీటిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.
ప్రత్యేకంగా థీమ్ బేస్డ్ టౌన్‌షిప్‌లు
విశాఖలో మూడు థీమ్ బేస్డ్ టౌన్‌షిప్‌ల నిర్మాణంపై వీఎంఆర్‌డీఏ అధికారులు దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రాంతాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే భీమిలి మండలం కొత్తవలస, ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామాలను గుర్తించారు. మరో రెండు ప్రదేశాల గుర్తింపు తుది దశలో ఉంది. వీటి ద్వారా నిర్దేశిత రంగాల్లో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. వీటిని పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దేశ, విదేశాలకు చెందిన నగర ప్రణాళిక నిపుణులు, ఆర్కిటెక్ట్‌లు, ఇతర రంగాల నిపుణులతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్‌లు తెలిపారు.