
గంజాయి స్మగ్లర్ల ఆస్తులు కూడా జప్తు చేస్తాం
ఆరిలోవ: పోలీసులకు పట్టబడిన గంజాయి స్మగ్లర్ల ఆస్తులను కూడా జప్తు చేస్తామని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈగల్) క్లబ్ చీఫ్, ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని ఆయన అధ్యక్షతన ఈగల్ క్లబ్ శుక్రవారం సందర్శించింది. కారాగారం సూపరింటెండెంట్ ఎం.మహేష్‌బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్లు ఎన్.సాయిప్రవీణ్, సీహెచ్ సూర్యనారాయణ, జైలర్లు, ఈగల్ బృందంతో కలసి గంజాయి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడి ఎన్‌డీపీఎస్ చట్టంపై అవగాహన కల్పించారు. ఏయే కేసుల్లో జైలుకు వచ్చారు, ఏ పరిస్థితిలో ఎన్‌డీపీఎస్ కేసుల్లో ఇరుకున్నారు, తదితర వాటి గురించి ఆరా తీశారు. అనంతరం జైల్ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. రెండుసార్లు కంటే ఎక్కువ గంజాయి కేసులు నమోదైతే అలాంటివారిపై సస్పెక్టడ్ షీట్ తెరుస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 3,700 మందిపై సస్పెక్టడ్ షీట్ నమోదు చేసినట్లు తెలిపారు. అల్లూరి జిల్లాలో డ్రోన్‌ల ద్వారా గంజాయి సాగును గుర్తించి నాశనం చేశామన్నారు. ఒడిశా నుంచి దిగుమతి అవుతున్న గంజాయిని సరఫరా చేస్తూ రాష్ట్రంలో పోలీసులకు పలువురు పట్టుబడుతున్నట్లు తెలిపా రు. దానివల్ల రాష్ట్రంలో గంజాయి కేసుల్లో పట్టుబడినవారి సంఖ్య పెరుగుతోందన్నారు. విశాఖ కేంద్ర కారాగారంలో 1,800 మంది ఖైదీలు ఉంటే వారిలో 1,008 మంది గంజాయి కేసుల్లో వచ్చినవారేనని వెల్లడించారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిపై ఈగల్ క్లబ్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫోన్ చేసి, సమాచారం అందించవచ్చని సూచించారు.