
దేశభక్తిని చాటిచెప్పేలా ‘హర్ ఘర్ తిరంగా’
మహారాణిపేట: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం శుక్రవారం నుంచి ఆగస్టు 15 వరకు జిల్లాలో జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని, దేశభక్తిని పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం నుంచి 13 వరకు ‘తిరంగా యాత్ర’, ‘తిరంగా సెల్ఫీలు’, ‘తిరంగా ట్రిబ్యూట్’, ‘తిరంగా మేళా’ కార్యక్రమాలు జరుగుతాయి. ఆగస్టు 12న ఉదయం 7 గంటలకు బీచ్ రోడ్డులోని కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో ప్రజలందరూ పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అలాగే పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు దేశభక్తి గేయాలు, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను జీవీఎంసీ పరిధిలో యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్, గ్రామీణ ప్రాంతాల్లో జెడ్పీ సీఈఓ చూసుకుంటారని కలెక్టర్ వివరించారు. అందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.