
చదివింపులు
చినబాబుకు
రూ.12 కోట్ల
ఇప్పటికే చెల్లించిన రియల్టర్లు డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ పేరుతో రంగ ప్రవేశం ఎండాడలో ఇప్పటికే పలు ప్రాజెక్టులు చేపట్టిన ఓ సంస్థ దసపల్లా భూముల వ్యవహారంలోని మరో రియల్టర్‌కు అప్పగింత విచారణ చేయాలని అన్ని పక్షాల నుంచి డిమాండ్ కమిటీ కష్టమంటూ కలెక్టర్ నివేదికతోనే స్పీకర్‌ను బుజ్జగించే యత్నం?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
నిషేధిత జాబితా నుంచి తొలగించిన ఎండాడలోని 5.10 ఎకరాల భూ వ్యవహారంలో చినబాబుకు ఇప్పటికే రూ.12 కోట్ల చదివింపులు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ చెల్లింపుల వ్యవహారాన్ని మొత్తం దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నేత చూసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చెల్లింపులు పూర్తయిన తర్వాత ఎండాడలోని సర్వే నంబరు 14–1 లోని 5.10 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టు సమాచారం. ఈ భూమిని అభివృద్ధి చేసేందుకు ఇద్దరు రియల్ ఎస్టేట్ సంస్థలు రంగప్రవేశం చేశాయి. ఇప్పటికే ఎండాడలో పలు ప్రాజెక్టులు చేపట్టిన సంస్థ ఒకటి కాగా.. చినబాబు సామాజికవర్గానికే చెంది, దసపల్లా భూముల వ్యవహారాల్లో ఉన్న మరో సంస్థ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ స్థలంలో 14 ఫ్లోర్ల వరకూ నిర్మించే అవకాశం ఉందని.. తక్కువలో తక్కువగా చదరపు అడుగుకు ప్రారంభంలోనే రూ.6 వేల వరకూ ధర పలికే అవకాశం ఉందని సదరు రియల్టర్లు లెక్కలు వేసినట్టు కూడా తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ పేరు మీద కొంత భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఆ సంస్థ నుంచి విశాఖకు చెందిన ఈ ఇద్దరు రియల్టర్ల చేతికి రానుందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే అనధికారికంగా ఒప్పందం జరిగినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ భూమి వ్యవహారంలో విచారణ చేయాలంటూ ప్రతిపక్షంతో పాటు స్వపక్షం నుంచి కూడా స్పష్టమైన డిమాండ్లు వస్తున్నాయి. కమిటీ వేసి విచారణ చేయాలంటూ స్వయంగా స్పీకర్ కోరినప్పటికీ కుదరదని కలెక్టర్ నివేదికతోనే సరిపుచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మొత్తంగా నేరుగా చినబాబు పాత్ర ఉండటంతో విచారణ జరిపేందుకు ప్రభుత్వం వెనకాడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరిన్ని భూములపై నిషేధం ఎత్తివేత..!
వాస్తవానికి ఎండాడలోని 14–1 సర్వే నంబరుకు చెందిన 5.10 ఎకరాల భూమికి చెందిన రికార్డుల్లో రెవెన్యూ అధికారులనూ తికమక పెట్టే వ్యవహారాలు నడిచాయనే విమర్శలున్నాయి. ఫలానా పేరు మీద ఈ భూమి ఉందని...అయినప్పటికీ ఇది ప్రభుత్వ భూమి కావున రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ స్వయంగా గతంలో కలెక్టర్ రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించారు. తీరా నిషేధిత జాబితా నుంచి తొలగించే సమయానికి ప్రైవేటుపరం చేస్తూ నిర్ణయాలు వెలువడ్డాయి. వాస్తవానికి 14–1 సర్వే నంబరులోని భూమి చెట్టిపల్లి సీతారామయ్య పేరు మీద నమోదై ఉంది. అయితే తాజాగా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం ఈ భూమి మాజీ సైనిక అధికారికి చెందినదని, చెట్టిపల్లి సీతారామయ్య పేరు కేవలం ఫారం–3లో మాత్రమే ఉందని పేర్కొన్నారు. అయితే ఇందుకు భిన్నంగా అసలు వ్యక్తి సాగులోనే లేరంటూ వై.బాలిరెడ్డికి చెందినదంటూ ఆయన పేరు మీద బదలాయించాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పై నుంచి ఆదేశాలు వచ్చేందుకు కీలకంగా వ్యవహరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన నేత ప్రధానంగా చక్రం తిప్పినట్టు సమాచారం. చినబాబు అండతో రెచ్చిపోయారనే విమర్శలున్నాయి. ఎన్నికలకు ముందు చినబాబుకు నేరుగా తమ సామాజిక వర్గానికి చెందిన నేతల ద్వారా హైదరాబాద్‌లో భారీగా ఎలక్షన్ ఫండ్ సమకూర్చడంతో ఈ నేతకు సదరు చిన్నబాబు వద్ద పలుకుబడి ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. స్థానిక నేతలు, ఎమ్మెల్యేలతో ఏ మాత్రం సంబంధం లేకుండా వ్యవహారాలు నడుపుతుండటంతో సదరు దక్షిణ నియోజకవర్గ నేతపై ఆ పార్టీలోని ఇతర నేతలందరూ రుసరుసలాడుతున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఇంకా ఏమైనా ఫైల్స్ ఉంటే తన వద్దకు తీసుకురావాలంటూ సదరు దక్షిణ నియోజకవర్గ నేత కోరుతున్నట్టు తెలుస్తోంది. అంటే త్వరలో మరిన్ని ప్రభుత్వ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించనున్నారన్నమాట.
కమిటీ కష్టం... కలెక్టర్ నివేదికతోనే సరి...!
వాస్తవానికి ఎండాడ భూమి వ్యవహారంలో సొంత పార్టీ నేతల నుంచే విచారణ జరపాలనే డిమాండ్ వస్తోంది. ఇప్పటికే ఈ భూమి వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలెక్టర్‌కు లేఖ రాశారు. న్యాయవిచారణ జరగాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. మరోవైపు నివేదిక సమర్పించాలంటూ రెవెన్యూ మంత్రికి స్పీకర్ లేఖ ద్వారా ఆదేశించారు. ఇక మండలిలోని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సైతం ఈ వ్యవహారంలో లోతుగా విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలంటూ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మాజీ సైనికులకు చెందిన భూముల విషయంలో సీనియర్ అధికారులు, రాజకీయ నేతల ప్రమేయం ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ గ్రాబింగ్ వ్యవహారాల్లో అటు అధికారులు, ఇటు రాజకీయ నేతల మధ్య ఏర్పడుతున్న అనైతిక సంబంధాలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. జనసేన కార్పొరేటర్ సైతం విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇలా అన్ని పార్టీల నేతలు ఎండాడ భూమి విషయంలో అటు అధికారులు, ఇటు రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న అభిప్రాయాన్ని బలంగానే వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం నామమాత్ర స్పందన రాకపోవడం గమనార్హం. అంతేకాకుండా కమిటీ వేయాలని రెవెన్యూ మంత్రికి రాసిన లేఖలో స్పీకర్ కోరగా.. కమిటీ వేయాలంటే ముఖ్యమంత్రి అనుమతి కావాలని తేల్చిచెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేవలం కలెక్టర్ ఇచ్చిన నివేదికనే స్పీకర్‌కు.. రెవెన్యూ మంత్రి ఇవ్వనున్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్వయంగా సొంత పార్టీకే చెందిన స్పీకర్ కోరినప్పటికీ ప్రభుత్వం పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈ వ్యవహారంలో చినబాబు పాత్ర ఉండటం వల్లే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్న అభిప్రాయం అందరిలోనూ బలపడుతోంది.