
విశాఖ. వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. వివేకానంద హత్య కేసులో లేనిపోని ఆరోపణలు చేసే బదులు.. ఆ కేసును సీబీఐతో విచారణ చేయించడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని బొత్స నిలదీశారు. అసలు వివేకా హత్య కేసు చంద్రబాబు హయాంలో జరిగిందని, మరి ఆ సమయంలో ఎందుకు సీబీఐకి అప్పగించలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఆ కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు.
మరి ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆ కేసును ఎందుకు సీబీఐకి అప్పగించడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైందని, మరి వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారన్నారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 9) విశాఖ నుంచి మాట్లాడిన బొత్స.. వివేకా హత్య కేసులో ఆధారాలుంటే బయటపెట్టొచ్చు కదా అని బాబును సూటిగా ప్రశ్నించారు.
‘14 నెలలు నుంచి చంద్రబాబు ఏమి చేస్తున్నారు. సిగ్గు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఎన్నికలు కోసమే వివేకానంద హత్య గురించి మాట్లాడుతున్నారు. వచ్చే నాలుగు ఏళ్ళు ఇదే అంశం చంద్రబాబు మాట్లాడుతారు’ అంటూ మండిపడ్డారు.