
సాక్షి, విశాఖపట్నం: ఆర్థికాంశాల కంటే సామాజిక అంశాలే వెనుకబాటుతనానికి కారణమని అంబేద్కర్ గ్రహించారని.. అలాంటి వ్యక్తి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పడం తెలిసిందే. అయితే ఆయన పార్టీ వాళ్లేమో.. అంబేద్కర్ కంటే పవనే గొప్ప అనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. అవును..
పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటనలో జనసేన నేతలు మరీ దుర్మార్గంగా వ్యవహరించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటో కనిపించకుండా.. దానిపై పవన్ కళ్యాణ్ పోస్టర్‌ను అంటించారు. తాటి చెట్ల పాలెం సిగ్నల్ వద్ద ఈ పోస్టర్ వెలిసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన ఇంచార్జి పసుపులేని ఉషాకిరణ్ పేరిట ఈ పోస్టర్లు వెలిసినట్లు తెలుస్తోంది.
మహాత్ముల ఫొటోలు.. వాళ్ల కొటేషన్లు అక్కడున్న గోడపై వరుసగా ఉన్నాయి. అందులో అంబేద్కర్ చిత్రాన్ని మాత్రమే జనసేన పోస్టర్ కవర్ చేసింది. దీంతో ఆ దారి గుండా వెళ్తున్న వాళ్లు అది చూసి.. జనసేన ప్రచార పిచ్చి పరాకాష్టను చేరిందని, తమ ప్రచార పిచ్చి కోసం అంబేద్కర్‌ను అవమానించారంటూ వ్యాఖ్యానించారు.
ఇటు సోషల్ మీడియాలోనూ.. అంబేద్కర్ కంటే పవన్ గొప్పాడని జనసేన భావిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. పవన్ పరువు తీసే పనిలో జనసేనవాళ్లు బిజీగా ఉన్నారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ చర్యపై మీరెలా స్పందిస్తారు?..