
రాజకీయ వ్యూహంతోనే కూటమితో కలిసి పోటీ
ఆ వ్యూహం లేకపోవడం వల్లే ఎందరో వెళ్లిపోయారు
జనసేన సమావేశంలో పవన్ కళ్యాణ్
అల్లిపురం/జగదాంబ(విశాఖ): ఒంటరి పోటీతో జనసేనకు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండేవన్న విషయం ఎప్పుడూ చర్చనీయాంశమేనని ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్టీలు పెట్టి, రాజకీయ వ్యూహం లేకపోవడం వల్ల ఎంతో మంది వెళ్లిపోయారని అన్నారు. అందుకే కేవలం ‘ఐడియాలజీ’పై మాత్రమే కాకుండా, రాజకీయ వ్యూహంతో గత ఎన్నికల్లో కలిసి జట్టుగా పోటీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ‘విడిగా వెళితే వచ్చి ఉండేదో.. రాదో..’ అని ఈ సందర్భంగా అన్నారు.
రానున్న రోజుల్లో సినిమాలూ చేస్తానని పవన్ స్పష్టం చేశారు. ‘సేనతో సేనాని’ పేరుతో విశాఖలో మూడు రోజుల పాటు నిర్వహించిన సమావేశాల అనంతరం శనివారం ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ‘పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు త్రిశూల్ కార్యక్రమాన్ని దసరా తర్వాత ప్రారంభిస్తాం. ఏదో ఒక రోజు జనసేన జాతీయ పార్టీ అవుతుంది. రాష్ట్రంలో కూటమి సుస్థిరంగా ఉండాలి. జనసేన వల్లే విశాఖ స్టీలు ప్రైవేటుపరం కాకుండా ఆగింది’ అని పవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
చిరంజీవిని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు!
కాగా, ‘పార్టీలు పెట్టి సరైన రాజకీయ వ్యూహం లేక వెళ్లిపోయారు’ అంటూ పరోక్షంగా అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ గురించే ఆయన మాట్లాడరనే గుసగుసలు సమావేశంలోనే కార్యకర్తల నుంచి వినిపించడం గమనార్హం. దీంతో, పవన్ వ్యాఖ్యలపై అటు సోషల్ మీడియాలో సైతం పలువురు నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.