
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయమై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదన్నారు. విశాఖ ఉక్కు అందరిది..స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైఎస్సార్‌సీపీ ధ్యేయం అని చెప్పుకొచ్చారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ పోరాటం కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాము. పోరాటంలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా నేతల అభిప్రాయాలను కూడా తీసుకుంటాము. కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైఎస్సార్‌సీపీ ధ్యేయం. మా పార్టీ కార్పొరేటర్ల పోరాటంతో GVMCలో స్టీల్ ప్లాంట్‌పై తీర్మానం చేయించారు.
విశాఖ ఉక్కు ప్రజల అందరి హక్కు. 32 మంది ప్రాణ త్యాగంతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంటే కూటమి నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ప్లాంట్‌పై కూటమి నేతల దొంగ బుద్ధి బయట పడింది. ప్లాంట్ కోసం కూటమి నేతలు గతంలో దొంగ దీక్షలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మొదటి నుంచి వైఎస్ జగన్‌ది ఒకే మాట.. ప్రైవేటీకరణ జరగకూడదు అని చెప్పారు. ఎలాంటి పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే తాను వచ్చి పోరాటంలో పాల్గొంటానని జగన్ చెప్పారు.

పవన్ కళ్యాణ్ గతంలో ఎంపీలు స్టీల్ ప్లాంట్ కోసం ఉప్పు కారం తినాలని మాట్లాడారు. ఈ రోజు ఉప్పు కారం ఎవరికి పంపుతారు. ఎవరు తినాలి ఉప్పు కారం.. అది పవనే చెప్పాలి. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ప్రధాన మంత్రితో మాట్లాడలేదు. వైఎస్ జగన్ ధైర్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని ప్రధాని మోదీని కోరారు’ అని గుర్తు చేశారు.