
సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో గురువారం భేటీ అయ్యారు. వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనల్లో భద్రతా లోపాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సింగయ్య మృతిపై చంద్రబాబు చేస్తున్న రాజకీయాల్ని వివరించారు.
అనంతరం, వైఎస్సార్‌సీపీ శాసన మండలి విపక్షనేత,బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో చట్టవ్యతిరేక చర్యలను చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌కు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వడం లేదు. భద్రత కల్పించకపోగా తిరిగి మా నాయకుడితో పాటు మాపై కేసులు పెడుతున్నారు. ఇది అప్రజాస్వామికం. ఈ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది. గవర్నర్ దృష్టికి అన్ని అంశాలను తీసుకెళ్లాం. సత్తెనపల్లిలో ప్రైవేట్ వాహనం ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని సాక్షాత్తూ జిల్లా ఎస్పీనే స్టేట్ మెంట్ ఇచ్చారు. సింగయ్య ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్‌కు సంబంధం లేదన్నారు. మూడు రోజుల తర్వాత ప్రభుత్వం ఒత్తిడితో ఎస్పీ మరో ప్రకటనను చేశారు. కారు డ్రైవర్ , కారులో ఉన్న జగన్‌తో పాటు మరికొంత మందిపై కేసులు పెట్టారు
ఇలాంటి దుర్మార్గపు చర్యలు ఏనాడూ చూడలేదు. చరిత్రలో ఎన్నడూ చూడనట్లు కేసులు నమోదు చేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాధరణ ఉన్న నాయకుడు. మా నాయకుడికి రక్షణ కల్పించాలి. సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా?. నిజంగా ప్రభుత్వం భద్రత కల్పిస్తే ఘటన జరిగినపుడు ఎవరూ ఎందుకు చూడలేదు.ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఏడాది కాలంలోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది .ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడం మా బాధ్యత. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చూడలేదు’ అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,హోమంత్రి అనితకు బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. పవన్ ఎవడి నార తీస్తారు.. ఎవరి మక్కెలు ఇరగదీస్తారు.ప్రజలే అందరి నార తీస్తారని గుర్తుంచుకోండి. తెలివితక్కువ మాటలు వెనక్కి తీసుకోవాలి. బాధ్యతా రాహిత్యమైన మాటలు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేవలం ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. గతంలో పర్యటనల సమయంలో చంద్రబాబు ఎందుకు అడిగారు. జడ్ ప్లస్ ఉన్న వ్యక్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా అని ఎందుకు ప్రశ్నించారు