
సాక్షి, నర్సీపట్నం: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలు పునర్విభజన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశ్యంతో 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ తీసుకువచ్చారన్నారు.
‘‘8500 కోట్లు మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ఖర్చు మొదలు పెట్టారు. పేద వాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ప్రతి ఇంటి నుంచి ఒక డాక్టర్‌ను తయారు చేయాలన్నది వైఎస్ జగన్ ఆశయం’’ అని అమర్‌నాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వరకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. 4500 మెడికల్ సీట్లు విద్యార్థులకు వస్తాయని ఆశించారు. కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు’’ అని గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు.
నర్సీపట్నం మెడికల్ కాలేజీలో హాస్పిటల్ భవనం మూడు అంతస్తులు పూర్తి అయింది. ఈ భవనం నిర్మాణం పూర్తి చేయడానికి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?. చంద్రబాబు కామన్ మెన్ కాదు.. క్యాపలిస్ట్ మెన్. అప్పు చేసిన 2 లక్షల కోట్లలో ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేస్తే సరిపోతుంది. పులివెందుల మెడికల్ కాలేజీకు సీట్లు వద్దని లేఖ రాశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తున్న చంద్రబాబు, నేడు మెడికల్ కాలేజీలను నేనే తెచ్చానని మాట్లాడుతున్నారు. సైకో కంటే పెద్ద పేరు చంద్రబాబు అని గూగుల్ చూపిస్తుంది. కిమ్ ఉత్తర కొరియా నియంత అయితే లోకేష్ ఏపీ నియంత’’ అంటూ గుడివాడ అమర్‌నాథ్ దుయ్యబట్టారు.
ప్రభుత్వ భూములు మీ ఇష్టం వచ్చిన వారికి ఇవ్వడానికి మీ అబ్బ జాగీరు కాదు. పేదవాడికి రాష్ట్రంలో చోటు లేదు. వైఎస్ జగన్ పథకాలను కాపీలను కొట్టిన ఘనత చంద్రబాబుది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ వాటిని ప్రభుత్వ పరం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. నర్సీపట్నంలో ఇప్పటికే 50 కోట్లకు పై మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ఖర్చు చేశారు. స్పీకర్ అయ్యన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం బాధ్యత తీసుకోవాలి’’ అని గుడివాడ అమర్‌నాథ్ డిమాండ్ చేశారు.
