భక్తుల సౌకర్యార్థం జీవీఎంసీ ఏర్పాట్లు
డాబాగార్డెన్స్: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా జీవీఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. నగర మేయర్ పీలా శ్రీనివాస్ మంగళశారం అధికారులతో కలిసి కొండపై జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుధ్యం, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు. లక్షలాది మంది భక్తుల కోసం మంగళ, బుధ, గురువారాల్లో ఆరు షిఫ్టుల్లో 1,350 మంది పారిశుధ్య కార్మికులు సేవలు అందిస్తున్నట్లు మేయర్ తెలిపారు. దేవస్థానం పరిసర ప్రాంతాలన్నింటిలో పారిశుధ్య పనులు జరుగుతున్నాయని, శానిటరీ అధికారులు వీటిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. భక్తుల తాగునీటి కోసం 193 పాయింట్లలో వాటర్ క్యాన్లు, వాటర్ బాటిల్స్ సిద్ధం చేశామన్నారు. ఎండల దృష్ట్యా అదనంగా ఆరు నీటి ట్యాంకర్లను సిద్ధంగా ఉంచామని, తాగునీటి సరఫరాను పర్యవేక్షించడానికి సిబ్బందిని నియమించామన్నారు. 21 ప్రాంతాల్లో 401 తాత్కాలిక మరుగుదొడ్లు, ఐదు మొబైల్ టాయిలెట్లు, చెత్త సేకరణకు డంపర్, కంపాక్టర్ బిన్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్ శివప్రసాద్‌రాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


