ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు చర్యలు
ఆరిలోవ: ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు అటవీశాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీవీ చలపతిరావు తెలిపారు. మంగళవారం ఇందిరాగాంధీ జూ పార్కులో అటవీశాఖ, ట్రీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల వలలకు చిక్కి తాబేళ్లు మరణించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం ఇవి గుడ్లు పెట్టే కాలం కావడంతో నిఘా పెంచామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తీరప్రాంతాల్లో 73 హెచరీలు ఉన్నాయని, గత ఏడాది సుమారు 6.80 లక్షల గుడ్లు పొదిగించగా, వాటి నుంచి వచ్చిన 2.40 లక్షల తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టినట్లు వివరించారు. ఈ ఏడాది కూడా ఇదే స్థాయిలో సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అడవుల సమీపంలో మిగిలిపోయిన ఆహారాన్ని బయట పడేయడం వల్ల కోతులు, చిరుతలు, అడవి పందులు వంటి వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయని, ఇది ప్రజలకు ఇబ్బందిగా మారుతోందని చలపతిరావు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగుల దాడిని అరికట్టేందుకు కుంకీ ఏనుగులను తీసుకువస్తున్నామని, మరో మూడు నెలల్లో గుచ్చిమి వద్ద కుంకీ ఏనుగుల క్యాంపును ప్రారంభిస్తామని వెల్లడించారు. అలాగే గ్రామాల్లో కోతుల బెడదను నియంత్రించడానికి ‘హనుమాన్’ కార్యక్రమం చేపడుతున్నామని, వాటికి సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. విశాఖ జాతీయ రహదారిపైకి కంబాలకొండ నుంచి వన్యప్రాణులు రాకుండా రెండు కిలోమీటర్ల మేర కంచె ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో విశాఖ సర్కిల్ సీఎఫ్ బి.ఎం దివాన్ మైథీన్, జూ క్యూరేటర్ బి.మంగమ్మ, వివిధ జిల్లాల డీఎఫ్‌వోలు రవీంద్రభీమా, వెంకటేష్, ప్రసన్న, కొండలరావు పాల్గొన్నారు.
ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్
పీవీ చలపతిరావు


