పూర్ణామార్కెట్‌లో 16 దుకాణాలు దగ్ధం
రూ.50 లక్షలు ఆస్తి నష్టం
జగదాంబ: పూర్ణామార్కెట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 16 దుకాణాలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.50 లక్షల వరకు నష్టం జరిగింది. సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో మార్కెట్‌లోని సెంటర్ పాయింట్ వద్ద ఉన్న పూజాసామగ్రి దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న వ్యక్తులు గమనించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే 16 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. క్రిస్మస్, జనవరి 1వ తేదీ నేపథ్యంలో వ్యాపారులు భారీగా సరుకులు కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకున్నారు. సుమారు రూ.50 లక్షల వరకు నష్టం జరగడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. సంఘటన అర్ధరాత్రి సంభవించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు, వన్‌టౌన్ సీఐ పూడి వరప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
వాసుపల్లి పరామర్శ
దుకాణాలు దగ్ధమైన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వెంటనే పూర్ణామార్కెట్‌కు చేరుకుని పరిశీలించారు. సంబంధిత దుకాణ యాజమానులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రమాద విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆదుకోవాలని కోరుతామని తెలిపారు. వాసుపల్లి వెంట వార్డు అధ్యక్షుడు అలపన కనకరెడ్డి తదితరులు ఉన్నారు.
వారి పనేనా..
పూర్ణామార్కెట్‌లో సెంటర్ పాయింట్ దరి గతంలో పండ్ల మార్కెట్ ఉండేది. తరువాత పండ్ల మార్కెట్ పాతబస్టాండ్ వద్దకు మార్చడంతో సుమారు 50 దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. వీటి పక్కనే పూజాసామగ్రి దుకాణాలు ఉండడంతో గంజాయి మత్తులో యువకులు మంటలు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ అధికారులకు గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో మత్తులో యువకులు చెలరేగిపోయి ఇటువంటి ఘాతుకాలకు పాల్పడుతున్నట్టు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


