గో మాంసం పూడ్చివేతపై గొల్లలపాలెంలో ఉద్రిక్తత
మా ఊరు కాలుష్యానికి నిలయమా?..
అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
పోలీసుల అండతో
అధికారుల జులుం
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో
రైతుల ఆందోళన
తగరపువలస: ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ పరిధిలోని దిబ్బపాలెం శ్రీమిత్రా మైరెన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజీలో సీజ్ చేసిన 189 టన్నుల గో మాంసాన్ని.. కుసులవాడ పంచాయతీ గొల్లలపాలెం శివారులో పూడ్చిపెట్టడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు షిణగం దామోదరరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, తొమురోతు సత్యనారాయణల ఆధ్వర్యంలో మంగళవారం పంచాయతీ రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టారు. సోమవారం కొండవాలు ప్రాంతంలో రహస్యంగా తవ్విన ఐదు అడుగుల గోతుల్లో ఇప్పటికే ఒకచోట మాంసాన్ని పూడ్చిపెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పంచాయతీలో అయితే మాంసాన్ని సీజ్ చేశారో అక్కడే పూడ్చాలి తప్ప, తమ గ్రామంలో వేయడానికి వీల్లేదని వారు తెగేసి చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను బెదిరించే ప్రయత్నం చేయగా, చివరకు మరింత లోతుగా గోతులు తవ్వి పూడ్చేలా అధికారులు హామీ ఇచ్చి గ్రామస్తులను ఒప్పించారు.
కుసులవాడ పంచాయతీలో నాలుగు వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నా, అభివృద్ధి పనులకు మాత్రం అధికారులు ఈ గ్రామాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని షిణగం దామోదరరావు విమర్శించారు. కేవలం కాలుష్య కారక పనులకు మాత్రమే తమ పంచాయతీ అధికారులు వినియోగిస్తున్నారని మండిపడ్డారు. గతంలో జీవీఎంసీ డంపింగ్ యార్డు, మైనింగ్ వంటి అంశాల్లోనూ కుసులవాడనే లక్ష్యంగా చేసుకున్నారని, ఇప్పుడు గో మాంసం పూడ్చడానికి కూడా తమ ప్రాంతాన్నే ఎంచుకోవడం దారుణమన్నారు. దిబ్బపాలెం నుంచి పది కిలోమీటర్ల దూరం దాటుకుని ఇక్కడికి తీసుకురావడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. కేవలం తమ ప్రయోజనాలు చూసుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని విస్మరిస్తున్న పంచాయతీ పాలకవర్గం, రెవెన్యూ అధికారుల తీరుపై ఆయన ధ్వజమెత్తారు.
టీడీపీ సిగ్గుమాలిన రాజకీయం
మరోవైపు ఈ ఘటనపై టీడీపీ నాయకులు సిగ్గుమాలిన రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు షిణగం దామోదరరావు ఆరోపించారు. స్థానికులు చేస్తున్న ఈ ఆందోళనను కేవలం వైఎస్సార్‌సీపీ కార్యక్రమంగా ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతున్నారని విమర్శించారు. కొండపై పశువులు మేపుకునే వారు ఈ మాంసం పూడ్చివేత వల్ల భయాందోళనలకు గురవుతున్నారని, ప్రభుత్వం పోలీసు బలగాలను అడ్డం పెట్టుకుని ప్రజల గొంతు నొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది గైర్హాజరై కేవలం పోలీసులతో బలవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.
గో మాంసం పూడ్చివేతపై గొల్లలపాలెంలో ఉద్రిక్తత
గో మాంసం పూడ్చివేతపై గొల్లలపాలెంలో ఉద్రిక్తత


