ఏపీలో తగ్గిన హెచ్‌ఐవీ కేసులు
మహారాణిపేట: ఏపీలో పదేళ్లుగా హెచ్‌ఐవీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడంపై శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, కేజీహెచ్‌లను సందర్శించిన కమిటీ ప్రజారోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే అవగాహన పెరగడం వల్లే కేసుల సంఖ్య తగ్గిందని సరైన మందులు వాడితే బాధితులు సాధారణ జీవితం గడపవచ్చని పేర్కొన్నారు. పీజీ వైద్య విద్యార్థులు ప్రభుత్వ కోటా కింద ప్రయోజనాలు పొందితే నిబంధనల ప్రకారం పదేళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల్లో , ప్రభుత్వ సేవలో తప్పనిసరిగా పనిచేయాలని లేనిపక్షంలో సర్టిఫికెట్ల రద్దుతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో కమిటీ సభ్యులు బండారు శ్రావణి శ్రీ, కన్నా లక్ష్మీనారాయణ, ఏపీఎల్‌ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.విశ్వనాథం, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ కె.పద్మావతి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.వీ.ఎస్.ఎం.సంధ్యాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డాక్టర్ జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఐవీపై అవగాహన అవసరం: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని తోట త్రిమూర్తులు సూచించారు. మంగళవారం రేసవానిపాలెంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్ రిబ్బన్ క్లబ్‌లు, యూత్ క్లబ్బులు, కళాజాత బృందాల ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎయిడ్స్ పరిస్థితులను డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు కమిటీకి వివరించారు.


