అపురూప సౌందర్యం.. అపార నిర్లక్ష్యం
కనుమరుగవుతున్న పర్యాటక వైభవం
సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం పర్యాటకులకు నిరాశ మిగుల్చుతున్న ఎర్రమట్టి దిబ్బలు
భీమునిపట్నం: విశాఖకు సమీపంలో.. భీమిలి బీచ్ రోడ్డులో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు భారతదేశంలోనే ఓ విశిష్టమైన సహజ నిర్మాణం. ఇవి సుమారు 4 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్నాయి. ఈ అరుదైన భౌగోళిక ప్రదేశం పర్యాటకులను ఆకర్షిస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో వాటి అందాలను ఆస్వాదించే అవకాశం లేకపోవడం విచారకరం.
సముద్ర మట్టం అనేకసార్లు పెరిగి, తగ్గడం వల్ల తీరం ఇసుక, బంకమట్టితో కప్పబడింది. వాతావరణ మార్పుల ప్రభావంతో ఇసుక ఎండకు గట్టిపడి దిబ్బలుగా మారింది. ఆ తర్వాత గాలి, నీటి కోత వల్ల ప్రస్తుత రూపాన్ని సంతరించుకుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఎర్రటి మట్టితో నిండి ఉండటం వల్ల వీటికి ఎర్రమట్టి దిబ్బలు అనే పేరు వచ్చింది. సుమారు 10 నుంచి 20 అడుగుల ఎత్తుతో.. దిబ్బల మధ్య నడవడానికి వీలుగా దారితో ఇవి విస్తరించి ఉన్నాయి. పాండిచ్చేరి, ముంబయి సమీపంలోని ఇలాంటి నిర్మాణాలు ఉన్నా.. అవి కేవలం ఐదు అడుగుల ఎత్తుకే పరిమితం. ఇంతటి ఎత్తైన, విస్తారమైన ఎర్రమట్టి దిబ్బలు దేశంలో ఇక్కడ మాత్రమే ఉండటం విశేషం. ఈ దిబ్బల ప్రత్యేకత కారణంగా రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడకు నిత్యం వస్తుంటారు. అంతేకాకుండా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలకు చెందిన ఎన్నో చిత్రాల షూటింగ్‌లు ఇక్కడ జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి.
శిథిలావస్థలో సౌకర్యాలు
గతంలో సందర్శకుల కోసం దిబ్బలకు వెళ్లే మార్గంలో కొన్ని వ్యూ పాయింట్లు, సేద తీరడానికి గుడిసెలు వంటివి ఏర్పాటు చేశారు. కనీసం వీటి వద్దనైనా పర్యాటకులు కాసేపు గడిపేవారు. అలాగే ఈ దిబ్బల ప్రాముఖ్యతను, చరిత్రను తెలిపే ఓ పెద్ద సమాచార బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అయితే కాలక్రమేణా ఈ వ్యూ పాయింట్లు, గుడిసెలు పూర్తిగా పాడైపోయి నిరుపయోగంగా మారాయి. సమాచార బోర్డు కూడా కనుమరుగైపోయింది. ఒకప్పుడు దిబ్బలలోకి వెళ్లే ముందు భాగం విశాలంగా ఉండటంతో పర్యాటకులు అక్కడే ఫొటోలు, వీడియోలు తీసుకుని ఆనందించేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రదేశమంతా తుప్పలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి.. కేవలం ఇరుకై న కాలిబాట మాత్రమే మిగిలింది. దీనికి తోడు పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించే వారి వల్ల పగిలిన సీసాలు, ఇతర చెత్త పేరుకుపోయి పర్యావరణం దెబ్బతింటోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి.. ఎర్రమట్టి దిబ్బల పూర్తి అందాలను ఆస్వాదించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.
నిరాశతో వెనక్కి వచ్చేశాం
పలు సినిమాల్లో ఎర్రమట్టి దిబ్బలను చూశాను. ఎంతో అద్భుతంగా కనిపించాయి. వా టిని నేరుగా చూడాలన్న ఆశతో కుటుంబం సహా ఇక్కడకు వచ్చాను. కానీ లోపల వరకు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉంది. కొద్ది దూరం వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చేశాం. ఎర్రమట్టి దిబ్బల పర్యటన నిరాశ కలిగించింది. –బి.వేణుగోపాల్, బెంగళూరు
నిర్లక్ష్యం చేయవద్దు
ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని సందర్శించడంలో పర్యాటకు లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని చెప్పిన అధికారు లు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ఇంతటి సహజ సంపదను, పర్యాటక ఆకర్షణను అభివృద్ధి చేసే అవకాశాన్ని వదులుకోవద్దు.
–కె.చంద్రశేఖర్, హైదరాబాద్
సౌకర్యాలు కల్పించాలి
సందర్శకులు లోపలకు వెళ్లి రావడానికి వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు, రెస్టారెంట్లు తదితర సౌకర్యాలు కల్పించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ మేరకు ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలి.
– వేదుల సాయిరాం, చిత్తూరు
పర్యాటకుల నిరాశ
ఎంతో ఆసక్తితో ఎర్రమట్టి దిబ్బలను చూడటానికి వచ్చే పర్యాటకులకు నిరాశే ఎదురవుతోంది. బీచ్‌రోడ్డును ఆనుకుని ఉన్న ఈ దిబ్బల అందాలను పూర్తిగా చూడాలంటే.. లోపలికి సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కానీ తీవ్రమైన ఎండ వేడి, కాలుతున్న ఇసుకలో అంత దూరం నడవడం కష్టతరంగా మారుతోంది. దీంతో చాలా మంది సందర్శకులు కొద్ది దూరం మాత్రమే వెళ్లి.. అలసిపోయి వెనుదిరుగుతున్నారు. పర్యాటకుల ఇబ్బందులను పరిష్కరించేందుకు గత ప్రభుత్వాలు కొన్ని ప్రకటనలు చేశాయి. సుమారు 15 ఏళ్ల కిందట నాటి పర్యాటక శాఖ ‘డిజర్ట్ విలేజ్’ పేరుతో ఒంటెల సఫారీ, రెస్టారెంట్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో శాండ్ స్కూటర్లు లేదా ఇతర వాహనాల ద్వారా సందర్శకులను లోపలికి తీసుకువెళ్లాలని భావించారు. కానీ ఈ ప్రణాళికలేవీ కార్యరూపం దాల్చలేదు.
అపురూప సౌందర్యం.. అపార నిర్లక్ష్యం
అపురూప సౌందర్యం.. అపార నిర్లక్ష్యం
అపురూప సౌందర్యం.. అపార నిర్లక్ష్యం
అపురూప సౌందర్యం.. అపార నిర్లక్ష్యం
అపురూప సౌందర్యం.. అపార నిర్లక్ష్యం


