‘ఓమ్ని’లో పిల్లల క్యాన్సర్ విభాగం ప్రారంభం
బీచ్‌రోడ్డు: ఇటీవల కాలంలో పిల్లల్లో క్యాన్సర్ పెరుగుతోందని ప్రముఖ పీడియాట్రిక్ వైద్యుడు రాధాకృష్ణ తెలిపారు. ప్రముఖ క్యాన్సర్ కేర్ నెట్‌వర్క్ సయాన్ క్యాన్సర్ క్లినిక్స్, ఓమ్ని హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆస్పత్రిలో అత్యాధునిక పిల్లల క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోందని, మనదేశంలో కూడా ఈ సంఖ్య ఆందోళనకర రీతిలో ఉందన్నారు. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ, త్వరగా చికిత్స తీసుకోవడం ద్వారానే క్యాన్సర్ నుంచి వారిని కాపాడుకోగలమన్నారు. సయాన్ క్యాన్సర్ క్లినిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ శశి సుంకర్ మాట్లాడుతూ క్రిటికల్ కేర్ నుంచి క్యాన్సర్ చికిత్స వరకు పిల్లల కోసం అవసరమైన అన్ని సేవలు ఇప్పుడు ఓమ్నిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేకించి పిల్లల కోసం రూపొందించిన మల్టీ–డిసిప్లినరీ క్యాన్సర్ చికిత్స కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. క్యాన్సర్ చికిత్సతో పాటు మానసిక ఆరోగ్యం, పోషకాహారం, జన్యు సలహా తదితర సమగ్ర సేవలు అందిస్తామన్నారు. సయాన్ క్యాన్సర్ క్లినిక్స్ ప్రతినిధులు డాక్టర్ భారతీదేవి, డాక్టర్ రాఘవేంద్ర నాయక్, డాక్టర్ వెంకట సుష్మ, డాక్టర్ గౌరి నాయుడు, డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, సుభాష్, ఓమ్ని ఆర్కే వైద్య నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


