జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
మహారాణిపేట: విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి అధికారులంతా కృషి చేయాలని, జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జరిగిన దిశా (జిల్లా స్థాయి అభివద్ధి సమన్వయ, మానటరింగ్ కమిటీ) సమావేశంలో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరు తెన్నులపై, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎంపీ చర్చించారు. గత సమావేశంలో తీసుకున్న చర్యలను సమీక్షించిన అనంతరం, జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అమలు చేస్తున్న పథకాల ఫలితాలు ప్రజలకు చేరేలా చూడాలని, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం తవ్విన రోడ్లను వెంటనే పూడ్చాలని, కొత్తగా వేసిన రోడ్లను తవ్వకుండా ప్రణాళికలు రూపొందించాలని ఎంపీ ఆదేశించారు. మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ గేట్ల అభివృద్ధికి జీవీఎంసీ నిధుల వినియోగంపై పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే జిల్లాలోని డ్రెయిన్లు, మురుగునీటి కాలువల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సూచించారు. రాజీవ్ గృహకల్ప ఇళ్లను వినియోగంలోకి తీసుకురావాలని, మరమ్మతులు చేసి అర్హులకు అందించాలని, వినియోగించని వారికి నోటీసులు జారీ చేయాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు. ఉత్తర నియోజకవర్గంలోని కప్పరాడ పాఠశాలను హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రస్తావించగా.. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులను ఎంపీ ఆదేశించారు. తప్పుడు పత్రాలు సమర్పించే వారికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరాదని పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు సూచించారు.
నైపుణ్య శిక్షణతో యువతకు ఉపాధి అవకాశాలు
యువతకు, ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని, పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలని, పీఎంఈజీపీ ద్వారా ఉపాధి కల్పించాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. గుర్తించిన క్రీడా మైదానాలు, స్టేడియంలను అభివృద్ధి చేయాలని, సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులను ప్రోత్సహించాలని, టిడ్కో, హుద్‌హుద్, రాజీవ్ గృహ కల్ప, పీఎం ఆవాస్ యోజన వంటి పథకాల కింద ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని, గాజువాక నుంచి లంకెలపాలెం వరకు సర్వీస్ రోడ్డు వేయాలని కోరారు. ప్రభుత్వ బడులు, అంగన్‌వాడీలకు వచ్చే పిల్లల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 95523 00009 వాట్సాప్ నంబర్ ద్వారా అన్ని ప్రభుత్వ సేవలు పొందవచ్చని ఎంపీ శ్రీ భరత్, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ‘మన మిత్ర’ పేరుతో రూపొందించిన వాట్సాప్ గవర్నెన్స్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దిశా సమావేశంలో అధికారులకు ఎంపీ ఆదేశం


