● 24,696 మందిలో 8,619 మంది ఇళ్ల లబ్ధిదారులే అర్హులు ● ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనపు సాయం ● కలెక్టర్ హరేందిర ప్రసాద్ వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం అందరికీ ఇవ్వడం లేదని కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ స్పష్టం చేశారు. జిల్లాలో పీఎంఏవై అర్బన్, గ్రామీణం కింద ఒకటి రెండు ఆప్షన్‌లో 24,696 గృహాలు నిర్మాణ దశలో ఉండగా.. ఇందులో 8,619 మందికి మాత్రమే ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఏంఏవైలో ఇల్లు మంజూరై వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వివిధ దశల్లో నిర్మాణాల్లో ఇళ్లకు ఉన్న ప్రస్తుత యూనిట్ విలువ రూ.1.80 లక్షలు కాగా.. అదనంగా ఎస్సీలు, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, పీవీజీటీలకు రూ.లక్ష చొప్పున సాయం అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పీఎంఏవై కింద 8,619 మంది లబ్ధిదారులకు రూ.43.40 కోట్ల అదనపు సాయం అందుతుందని వెల్లడించారు. నిర్మాణం పూర్తి చేసుకునే దశల వారీగా అదనపు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాకు నేరుగా జమ చేస్తారని చెప్పారు. జిల్లాలో మే నెలాఖరు నాటికి 7,750 గృహాలు పూర్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల నిర్మాణ దశలను గుర్తించి అదనపు సాయం మంజూరు జరుగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు ప్రత్యేక ర్యాంపులను కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
త్వరలో బ్లూఫ్లాగ్ జ్యూరీ బృందం రాక
రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్‌ను ఇటీవల తాత్కాలికంగా గుర్తింపు రద్దు చేసిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. తాత్కాలికంగా జీవీఎంసీ సహకారంతో మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశామని, బ్లూఫ్లాగ్‌కు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే సర్టిఫికెట్ జారీ చేసే జ్యూరీ బృందం రుషికొండ వస్తుందన్నారు. ఈలోగా సమగ్ర ఏర్పాట్లు చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జ్యూరీ బృందం సంతృప్తి పడే విధంగా బీచ్‌ను సుందరీకరించి.. సర్టిఫికెట్ రెన్యువల్ చేసేందుకు వంద శాతం కృషి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.