మహిళల భద్రతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు ప్రాధాన్యం

Mar 9 2025 12:55 AM | Updated on Mar 9 2025 12:55 AM

మహిళల

మహిళల భద్రతకు ప్రాధాన్యం

● జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ● ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

బీచ్‌రోడ్డు: రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తోందని, అందులో భాగంగానే ‘శక్తి’ యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో శనివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో విజయాలు సాధించిన మహిళలను గుర్తించి, వారిని గౌరవించాలన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కులు, సమానత్వం, సాధికారత గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా ఉన్నత విజయాలు సాధిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం ఇళ్ల పట్టాలను మహిళల పేరునే మంజూరు చేస్తుందని తెలిపారు. మహిళల పై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన చేకూర్చుకునేందుకు షియో ఆటోలు, ద్విచక్ర వాహనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలు తయారుచేసిన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్మకాల ద్వారా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ చోటు దక్కించుకోనున్నాయని వెల్లడించారు. కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థితికి చేరేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపుల ద్వారా ప్రతీ మహిళ ఆర్థికంగా స్థిరపడాలన్నారు. జిల్లాలో ర్యాపిడో ద్వారా 200 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కళాకారులు, చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తర్వాత మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. వ్యాసరచన, క్రీడలు, తదితర పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సన్మానించారు. మహిళా సంఘాల లబ్ధిదారులకు ర్యాపిడో స్కూటీలు, ఆటోలను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమ ప్రాంగణంలో మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణుకుమార్‌ రాజు, మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జి చిన్నయిదేవి, విశాఖ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు వై.గంగాభవానీ, జిల్లా సమైక్య కార్యదర్శి సూరమ్మ తదితరులు పాల్గొన్నారు.

పీఎం అజయ్‌ పథకం చెక్కు అందజేత

ఎంవీపీకాలనీ: జిల్లాలోని ఎస్‌హెచ్‌జీ మహిళలకు పీఎం అజయ్‌ ఉన్నతి పథకంలో భాగంగా రూ.35 లక్షల చెక్కును అందజేశారు. ఈ పథకం ద్వారా రూ.50 వేల రాయితీ రుణం కోసం జిల్లాలోని 25 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సత్యపద్మ తెలిపారు. ఈ నిధుల చెక్కును మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమక్షంలో లబ్ధిదారులకు అందజేసినట్లు వివరించారు.

మహిళల భద్రతకు ప్రాధాన్యం 1
1/1

మహిళల భద్రతకు ప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement