
వరాహ పుష్కరిణి
సింహాచలం: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈనెల 27న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన వరాహ పుష్కరిణికి పుణ్యనదీ హారతి నిర్వహించనున్నట్టు ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. దేవస్థానం అనుబంధ దేవాలయమైన కొండదిగువ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి స్వామి ఉత్సవమూర్తులను ఆ రోజు సాయంత్రం 4.30 గంటలకు తిరువీధిగా వరాహ పుష్కరిణి వద్దకు తీసుకెళ్తామన్నారు. అక్కడ గట్టుపై ఉత్సవమూర్తులను వేంజేపచేసి సాయంత్రం 5.30 గంటల నుంచి పుణ్యనదీ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. నక్షత్ర హారతి, కుంభ హారతి, ఆయుత దీపార్చనలు ఉంటాయన్నారు. అదే సమయంలో భక్తులు పుష్కరిణి గట్టుపై దీపాలు వెలిగిస్తారన్నారు. ప్రమిదలు, వత్తులు, నూనె దేవస్థానమే ఉచితంగా అందిస్తుందని తెలిపారు.