
అధికారులతో సంతోషాన్ని పంచుకుంటున్న వీసీ ప్రసాదరెడ్డి
● నాక్ ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ కై వసం ● వర్సిటీ చరిత్రలో తొలిసారిగా 3.74 సీజీపీఏ ● వివరాలు వెల్లడించిన వీసీ ప్రసాదరెడ్డి
ఏయూ క్యాంపస్ : శతాబ్ది వేడుకలకు చేరువవుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం మరో సమున్నత శిఖరాన్ని అధిరోహించింది. జాతీయ స్థాయిలో ఏయూ నాక్ ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ సాధించింది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్(ఎన్‌ఏఏసీ)కు చెందిన సభ్యులు ఏయూను సందర్శించి నాక్ ఏ ప్లస్, ప్లస్ గ్రేడ్ (3.74 సీజీపీఏ) అందించారు. ఈ మేరకు మంగళవారం ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. 98 సంవత్సరాల ఏయూ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజుగా ఇది నిలుస్తుందన్నారు. దేశంలో ఇప్పటి వరకు మూడు వర్సిటీలు మాత్రమే 3.70కు పైగా స్కోర్ కలిగి ఉన్నాయని, వీటిలో 3.74 స్కోర్‌తో ఏయూ ప్రత్యేకత చాటుకుందన్నారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో ఓవరాల్ విభాగంలో మొదటి 100 స్థానాల్లో నిలిచి నాక్‌లో 3.74 స్కోర్ కలిగిన ఏకై క వర్సిటీగా ఏయూ నిలిచిందన్నారు. నాక్ గుర్తింపు వచ్చే ఏడేళ్ల పాటు అంటే 2030 వరకు అమలులో ఉంటుందన్నారు.
విదేశాల్లో క్యాంపస్ స్థాపనకు అవకాశం
నాక్‌లో అత్యుత్తమ స్కోర్ సాధించిన ఏయూ.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెస్స్ హోదాకు దరఖాస్తు చేసే అవకాశం సాధించిందని వీసీ తెలిపారు. ఈ గుర్తింపు వల్ల ఏయూ విదేశాల్లో కూడా క్యాంపస్‌ను ప్రారంభించే అవకాశం లభిస్తుందన్నారు. రీసెర్చ్ నిధుల జారీకి ఈ ర్యాంకింగ్ ఎంతో దోహదపడుతుందన్నారు. రాష్ట్రానికే ఏయూ గర్వకారణంగా నిలిచి సీజీపీఏ ఐఐఎస్‌ఈ బెంగళూరును దాటేసిందన్నారు.
ఏడు అంశాలపై అధ్యయనం
నాక్ కమిటీ ఏయూలో సందర్శించిన సమయంలో ఏడు అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించిందని వీసీ వివరించారు. కరికులం, టీచింగ్–లెర్నింగ్, రీసెర్చ్, స్టూడెంట్ సపోర్ట్–స్టూడెంట్ ప్రొగ్రామ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గవర్నెన్స్–లీడర్‌షిప్, ఇన్‌స్టిట్యూషన్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనే అంశాలను పరిశీలించిందన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధిస్తున్న గ్రీన్ కెమిస్ట్రీని నాక్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. నాడు–నేడు పథకం స్ఫూర్తితో ఏయూలో చారిత్రక, పురాతన భవనాలను పరిరక్షించడం, మౌలిక వసతులను అభివృద్ధి చేసిన విధానాన్ని పరిశీలించి గ్రేడింగ్ ఇచ్చారన్నారు. ఇన్‌స్టిట్యూషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో ఏయూలో ఆ హబ్, విద్యార్థులు ఓవరాల్ డెవలప్‌మెంట్‌కి ఉపయుక్తంగా యోగా–క్రీడలు–సైకలాజికల్ కౌన్సెలింగ్ సెంటర్లను పరిశీలించి అత్యుత్తమ మార్కులు వేశారన్నారు.
సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో తొలిసారిగా ఏయూకు వచ్చిన సందర్భంలో వేదికపై చెయిర్ ప్రొఫెసర్ల ప్రాముఖ్యతను వివరించారన్నారు. దానిని ఏయూలో నేడు అమలు చేస్తున్నామన్నారు. ఐవోసీఎల్, ఆర్‌ఐఎస్‌ఎల్, జీఎంఆర్‌తో పాటు రెండు విదేశీ బహుళజాతి సంస్థలు కూడా చెయిర్ ప్రొఫెసర్లను నియమించాయన్నారు. ఏయూని పరిశ్రమలతో అనుసంధానం చేయడం, 16 చెయిర్ ప్రొఫెసర్లను కలిగి ఉండటాన్ని నాక్ అభినందించిందన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనను ఆచరణలో పెట్టడం, దీనికి నాక్ ప్రశంసలు లభించడంపై వీసీ సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఖేలో ఇండియాలో రూ.37.5 కోట్ల నిధులతో క్రీడా వసతుల కల్పనకు ఇటీవల ఆమోదం తెలుపుతూ తమకు ఉత్తర్వులు అందాయన్నారు. వచ్చే జనవరిలో నేషనల్ యూత్ కన్వెన్షన్‌కు ఏయూ ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు. నాక్ ర్యాంకింగ్ సాధనలో విద్యార్థులు, ఉద్యోగులు, పరిశోధకులు అందరి భాగస్వామ్యం ఉందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా నాక్ సాధన కోసం తీవ్రంగా కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్, ఐక్యూఏసీ సమన్వయకర్త ఆచార్య డి.లలిత భాస్కరి, ఓఎస్‌డీ వి.కృష్ణమోహన్, ప్రిన్సిపాళ్లు, డీన్‌లు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment