పరిగిలో ఆ రెండు వర్గాలు..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉమ్మడి జిల్లాలో ‘హస్త’వ్యస్తంగా తయారైంది. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రోజుకో నియోజకవర్గంలో కొత్త పంచాయితీ వెలుగు చూస్తుండటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
మంత్రి వద్ద చేవెళ్ల పంచాయితీ
చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భీం భరత్ మధ్య ఇప్పటికే అభిప్రాయ బేధాలు ఉన్నాయి. తాజాగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ (ఏఎంసీ) పీఠం ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరును తారస్థాయికి తీసుకెళ్లింది. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎదిరె చంద్రయ్య పేరును ఎమ్మెల్యే అధిష్టానానికి ప్రతిపాదిస్తే.. కేసారం శ్రీనివాస్ పేరును భీం భరత్ ప్రతిపాదించారు. చైర్మన్, వైఎస్ చైర్మన్ సహా డైరెక్టర్ల పదవులకు ఇద్దరు నేతల నుంచి వేర్వేరు ప్రతిపాదనలు వెళ్లడం కేడర్‌ను అయోమయంలో పడేసింది. ఇటీవల ఇదే నియోజకవర్గం కీలక నేతలు గాంధీ భవన్ ఎదుట ధర్నాకు దిగడం, తాజాగా జిల్లా ఇన్‌చార్జి మంత్రికి ఫిర్యాదు చేయడం తెలిసిందే.
మహేశ్వరంలో మూడు గ్రూపులు
మహేశ్వరం నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ మూడు గ్రూపులుగా విడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి మొదటి నుంచి ఇక్కడి నేతల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలే కారణమనే చర్చ కూడా ఉంది. డీసీసీ మాజీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి సహా ప్రస్తుత అధ్యక్షురాలు చిగురింత పారిజాత నరసింహారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్లార్ నియోజకవర్గంపై పట్టుకోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పటికే ఉప్పు నిపులా ఉన్న నేతల మధ్య తాజాగా కందుకూరు, మహేశ్వరం, నాదర్‌గుల్ పీఏసీఎస్‌ల పాలకమండళ్ల అభ్యర్థుల జాబితా ప్రతిపాదన అంశం మళ్లీ చిచ్చు రగిల్చింది. కనీస సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గ ఇన్‌చార్జే స్వయంగా నామినేటెడ్ అభ్యర్థుల పేర్లను సిఫార్సు చేయడాన్ని డీసీసీ అధ్యక్షురాలు చిగురింత పారిజాత తప్పుబట్టారు. తన సొంత నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఖరారు చేయడం ఏమిటంటూ ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వద్ద పంచాయతీ పెట్టడం.. తాత్కాలికంగా పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపివేయడం చర్చనీయాంశమైంది.
యాష్కీ వర్సెస్ జక్కిడి
ఎల్బీనగర్‌లో నేతల మధ్య ఉన్న అంతర్గత పోరు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమైంది. నియోజకవర్గ స్థాయిలోని పార్టీ పదవులు, కీలక నామినేటెడ్ పోస్టుల భర్తీలో నియోజకవర్గ ఇన్‌చార్జి మధుయాష్కీగౌడ్ కేవలం తనసామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిని తన వర్గీయులతో ఉద్దేశ పూర్వకంగానే రెచ్చగొట్టి పార్టీ నుంచి బయటికి పంపే కుట్ర చేశారనే విమర్శలు లేకపోలేదు. ఇప్పటికే ఇక్కడ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి కుమారుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి కేడర్‌ను బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాడు. యాష్కీ క్షేత్రస్థాయిలో ఉండకపోవడం, ఎన్నికల సమయంలోనే కన్పిస్తుండటం, అత్యవసర పరిస్థితుల్లో కేడర్‌కు అందుబాటులో ఉండకపోవడం పార్టీ సంక్షోభానికి కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నేతల మధ్య ఫ్లెక్సీ చిచ్చు
తాండూరులో పార్టీ కేడర్ ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయింది. ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విబేధాలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం శంకుస్థాపన సందర్భంగా మరోసారి బహిర్గతమయ్యాయి. ఫ్లెక్సీలపై ఫొటోల విషయంలో పెద్ద రగడే జరిగింది. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోనే మున్సిపల్ చైర్‌పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు గొడవకు దిగారు. ఇప్పటికే ఎమ్మెల్యే బుయ్యనిపై పట్నం వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆయన భూముల కొను గోలు, అమ్మకాలకు ఇచ్చిన ప్రాధాన్యత నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ఇవ్వడం లేదనే విమర్శలు లేకపోలేదు. స్థానికంగా ఉండకపోవడం, క్షేత్రస్థాయి కేడర్‌కు దూరంగా ఉండటం, క్యాంప్ ఆఫీసుకు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో.. ద్వితీయశ్రేణి కేడర్‌కు తెలియడం లేదు. పార్టీ సంస్థాగత సంక్షోభానికి ఇదే ప్రధాన కారణమనే అభిప్రాయం లేకపోలేదు.
ఉమ్మడి జిల్లాలో ‘హస్త’వ్యస్తం
నేతల మధ్య ఆధిపత్యపోరు
అయోమయంలో కేడరు
అధిష్టానం వద్దకు పంచాయితీలు
సమన్వయం చేయలేక సతమతం
పరిగి నియోజకవర్గంలోనూ పార్టీ కేడర్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే రామ్మోన్‌రెడ్డి, సీనియర్ నాయకుడు శ్రీనివాసరెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీకి శ్రీనివాసరెడ్డి సిద్ధం అవుతుండగా ఆయన్ను నిలువరించేందుకు ఎమ్మెల్యే శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ ఒకరిద్దరు అనుచరుల చెప్పుడు మాటలు నమ్మి..మిగిలిన వాళ్లను దూరం పెడుతున్నారనే అపవాదు కూడా ఎమ్మెల్యేపై ఉంది. ప్రత్యర్థి శ్రీనివాసరెడ్డి దీన్ని తనకు అవకాశంగా మలుచుకుంటున్నారు. తన వర్గాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నంతో పార్టీని రెండుగా చీలిపోవడానికి పరోక్షంగా కారణమయ్యారనే విమర్శ లేకపోలేదు.


