షాబాద్: వంద శాతం అక్షరాస్యత మండలముగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.అనిత పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం మండలంలోని పోతుగల్‌లో ఇంటింటి సర్వే నిర్వహించి నిరక్షరాస్యుల వివరాలను ప్రొఫార్మాలో నమోదు చేశారు. పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రతినిధులు, ఫీల్డ్ అసిస్టెంట్‌లతో కలిసి సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలాన్ని వంద శాతం అక్షరాస్యతా మండలముగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉల్లాస్–నవ భారత్ సాక్షరతా కార్యక్రమం కింద ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని 41 పంచాయతీల పరిధిలో సర్వే చేపట్టి 15 ఏళ్ల పైబడిన నిరక్షరాస్యులను గుర్తించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సెర్ప్ గ్రామ సంస్థ సహాయకులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


