గాంధీ ఆస్పత్రి: సంతానం లేదని బాధపడుతున్న మూడు కుటుంబాల్లో గాంధీ ఆస్పత్రి బోసి నవ్వులు పూయించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసి చివరికి తమను ఆశ్రయించిన కుటుంబాలకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా వైద్య సేవలు అందించారు. ఆస్పత్రి సంతాన సాఫల్య కేంద్రంలో గురువారం సూపరింటెండెంట్ ప్రొ. ఉషారాణి, గైనకాలజీ హెచ్‌ఓడీ ప్రొ. శోభ ఈ వివరాలు వెల్లడించారు.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన అనంతయ్య, శనమ్మకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. ప్రైవేటులో రూ.4 లక్షలు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. ఈ నెల 18న శనమ్మ 2.75 కిలోల బరువుగల మగ శిశువుకు జన్మనిచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం వాసి పీసరి విజయ్‌కుమార్, మాధవికి పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఈ నెల 18న 2.04 కిలోల ఆడ శిశువు పుట్టింది. వరంగల్ జిల్లా కరీమాబాద్ డీకే నగర్‌కు చెందిన దాసరి స్వరూప, రాజుకు 16 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఈ నెల 10న 1.8 కిలోల మగ శిశువు పుట్టాడు. ఈ సందర్భంగా గైనకాలజీ హెచ్‌ఓడీ ప్రొ. శోభ, ప్రొ. కృష్ణవేణి, ఫాతిమారఫీ, ఆర్‌ఎంఓలు సుథార్‌సింగ్, శ్రీకాంత్, ఎంబ్రియాలజిస్ట్ శివకృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్ అశోక్, కౌన్సిలర్ కవిత, ఐవీఎఫ్ నర్సింగ్ ఆఫీసర్లు సంకీర్తన, కల్సుంబేగం, స్వప్న, సుజనలను డీఎంఈ డాక్టర్ వాణి, గాంధీ ప్రిన్సిపాల్ ఇందిర, సూపరింటెండెంట్ ఉషారాణి అభినందించారు.
గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ ద్వారా ముగ్గురు శిశువుల జననం


