పూడూరు: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియను, అలాగే భూసేకరణ, రీ సర్వే తదితర అంశాలను అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు గురువారం పరిశీలించారు. పలు రికార్డులను చూశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్, నాయబ్ తహసీల్దార్ వీరేష్ బాబు, సర్వేయర్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
దంపతుల గొడవ
ఆత్మహత్య చేసుకున్న భర్త
బొంరాస్‌పేట: దంపతుల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల కేంద్రమైన దుద్యాలలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన కొప్పు మల్లేశం(38), భార్య మంగమ్మ తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో భార్య పిల్లలను, ఇంట్లోని మేకలను తీసుకొని పుట్టినిల్లు దోమ మండలం గుండాల గ్రామానికి వెళ్లింది. బుధవారం రాత్రి తండ్రి మొగులప్ప మల్లేశంతో మాట్లాడి పొలానికి వెళ్లాడు. గురువారం ఉదయం వచ్చి చూడగా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
తాండూరు రూరల్: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఎస్‌ఐ ప్రశాంత్ వర్ధన్ కథనం ప్రకారం పెద్దేముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కందనెల్లి గ్రామ శివారులో తాండూరుకు చెందిన 8 మంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం పేకాట స్థావరంపై దాడి చేసి పేక ముక్కలు, రూ. 12,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ ఆదేశాల మేరకు జిల్లాలోని నిరుద్యోగ యువతకు వేతన ఉపాధి శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇండియా లిమిటెడ్ గడ్డి అన్నారం ఆధ్వర్యంలో మూడు నెలల పాటు ఉచిత వేతన శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎనిమిది రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, ఏఐ డేటా బేస్ మేనేజ్‌మెంట్ కోర్సుల మీద శిక్షణ అందించనున్నట్టు చెప్పారు. వ్యాపారవేత్తలకు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, హెర్బల్ కాస్మోటిక్స్, ఫ్యాషన్ గార్మెంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఇతర రంగాలకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. అభ్యర్థులు ఎస్సీ వర్గానికి చెందిన వారై ఉండాలని చెప్పారు. వేతన ఉపాధి శిక్షణకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య, స్వయం ఉపాది శిక్షణకు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. ఎంపిక చేసిన కోర్సుకు అవసరమైన విద్యార్హత ఉండాలన్నారు. కుటుంబ వార్షికాదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించకూడదన్నారు. ఆధార్‌కార్డు తప్పనిసరిగా ఉండాలని, ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 80085 41919, 91337 72244 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
దాబాపై అధికారుల దాడుల్లో గుర్తింపు
తుర్కయంజాల్: జీహెచ్‌ఎంసీ ఆదిభట్ల సర్కిల్, తొర్రూర్ డివిజన్ పరిధి ఇంజాపూర్‌లో సాగర్ రహదారిపై శ్రీదేవి దాబా కట్టెల పొయ్యి వంటకం హోటల్‌పై గురువారం శానిటేషన్, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కుళ్లిపోయి బూజు పట్టిన చికెన్, రొయ్యలు, ఇతర ఆహార పదార్థాలను గుర్తించారు. కిచెన్‌లో పూర్తిగా అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. చెత్త కుండీలను కూడా అక్కడే ఏర్పాటు చేయడంతో మెడికల్ ఆఫీసర్ శారద నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిఫ్రిజిరేటర్‌లో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న చికెన్, చేపలు, రొయ్యలను బయట పడేశారు. మరోసారి ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి తనిఖీలు నిర్విస్తామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో పలువురు సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.


