ఆ ఒక్కటి తప్ప | - | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కటి తప్ప

Nov 19 2026 1:48 PM | Updated on Nov 19 2026 1:48 PM

ఆయుష్‌ కళాశాల,ఆస్పత్రి మంజూరు చేస్తే పరిపూర్ణం ప్రాచీన విద్యకు ప్రాధాన్యత కల్పించాలని విద్యార్థుల విన్నపం

కొడంగల్‌: సొంత నియోజకవర్గం కొడంగల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విద్యా పరంగా అన్నీ సమకూర్చా రు. ఎడ్యుకేషన్‌ హబ్‌ మంజూరు చేశారు. సుమారు రూ.5 వేల కోట్లు వెచ్చించి పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలు కళాశాలలను ప్రారంభించారు. విద్య, వైద్యం, రవాణా రంగాల్లో ఈ ప్రాంతానికి ప్రాధాన్యత కల్పించారు. అయితే ఒక్కటి మాత్రం మరిచారు. అదే ఆయుష్‌ మెడికల్‌ కళాశాల, ఆస్పత్రి. కొడంగల్‌కు ఆయూష్‌ కళాశాల మంజూరు చేయాలని ఆయుర్వేద విద్యార్థులు కోరుతున్నారు. నియోజకవర్గానికి చెందిన వందలాది మంది విద్యార్థులు కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ను అభ్యసిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆయుష్‌ కళాశాల ఏర్పాటు చేస్తే ఇక్కడి విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఆస్పత్రి మంజూరు చేస్తే ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. గతంలో ఈ ప్రాంత వాసులు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి వినతిపత్రం కూడా సమర్పించారు. సీఎం కొడంగల్‌కు ఎన్నో కళాశాలలు మంజూరు చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయూష్‌ కళాశాలను మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రాచీన వైద్యానికి ప్రాధాన్యత కల్పించాలి

తెలంగాణ ప్రభుత్వం ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని విద్యావంతులు కోరుతున్నారు. నియోజకవర్గంలోని కొడంగల్‌, దౌల్తాబాద్‌, దుద్యాల, బొంరాస్‌పేట మండలాల్లో ఉన్న ఆయుర్వేద ఆస్పత్రులు పని చేయడం లేదు. డాక్టర్లు, వైద్య సిబ్బంది లేక నిరుపయోగంగా ఉన్నాయి. పేదలకు ఆయుర్వేద వైద్యం అందని ద్రాక్షగా మారింది. గతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుర్వేద వైద్యశాలలు నేడు దయనీయ స్థితిలో ఉన్నాయి. వైద్యులు, సిబ్బంది లేక మూతపడ్డాయి. పేదలకు వైద్యసేవలు అందించాల్సిన ఉన్నతమైన ఆశయం నీరుగారుతోంది. కొడంగల్‌, దౌల్తాబాద్‌, దుద్యాల, బొంరాస్‌పేట మండలాల్లో 6 ఆయుర్వేద వైద్యశాలలు ఉన్నాయి. అందులో కొడంగల్‌ మండలం రుద్రారం, అంగడిరాయిచూర్‌, మండల కేంద్రాలు బొంరాస్‌పేట, దుద్యాల, దౌల్తాబాద్‌లో, కోస్గి మండలం గుండుమాల్‌లో ఆయుర్వేద వైద్యశాలలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి నిర్వహణ అగమ్య గోచరంగా మారింది. వాస్తవానికి ఒక్కో దవాఖానాలో ఒక డాక్టర్‌, కంపౌండర్‌, అటెండర్‌ ఉండాలి. ప్రభుత్వం వైద్యులు, కిందిస్థాయి సిబ్బందిని నియమించకపోవడంతో ఆస్పత్రులు మూత పడ్డాయి. ఇంచార్జ్‌లు ఉన్న చోట మందులు లేవు. ఆయుర్వేద విద్యలో ఎన్నో రోగాలకు మందులు ఉన్నాయి. ప్రాచీన విద్యగా పేరుగాంచింది. పూర్వీకుల నుంచి వస్తున్న మూలికా వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే పాలకుల నుంచి సరైన ప్రోత్సాహం లభించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. వైద్యులను నియమించి ఆస్పత్రులకు పూర్వ వైభవం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయుర్వేద విద్యార్థులు కోరుతున్నారు.

పట్టించుకోని అధికారులు

నియోజకవర్గంలోని ఆయుర్వే ఆసుపత్రులపై అధికారుల పర్యవేక్షణ లేదు. ఆయుర్వేద దవాఖానాల పర్యవేక్షణాధికారి కార్యాలయం హైదరాబాద్‌లో ఉండటమే ఇందుకు కారణం. వీటి నిర్వహణ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ చూడాల్సి ఉంటుంది. ఆయన ఇక్కడకు వచ్చేది లేదు.. చూసేది లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేద ఆసుపత్రుల్లో పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. ప్రభుత్వ వైద్యం పేదలకు ఉచితంగా అందే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

విద్యా పరంగా అన్నీ సమకూర్చిన సీఎం

హకీంపేటలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల

కొడంగల్‌లో 220 పడకల ఆస్పత్రి

కొడంగల్‌లో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌

హకీంపేటలో 440 పడకల టీచింగ్‌ ఆస్పత్రి

కొడంగల్‌లో నర్సింగ్‌ కళాశాల

హకీంపేటలో ఫిజియోథెరపీ కళాశాల

పారామెడికల్‌ కళాశాల

ఇండోర్‌ స్టేడియం

స్పోర్ట్స్‌ కోచింగ్‌ సెంటర్‌

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌

స్కిల్‌ యూనివర్సిటీ

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌

వెటర్నరీ కళాశాల

వ్యవసాయ కళాశాల

ఇంజనీరింగ్‌ కళాశాల

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు

డిగ్రీ కళాశాలలు

క్రీడా ప్రాంగణం

సైనిక్‌ స్కూల్‌

పీజీ కళాశాల

నియోజకవర్గానికి మంజూరు చేసిన విద్యా సంస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement