అనంతగిరి: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ఆర్థిక భరోసా పొందవచ్చని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం నగరం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లాలో పథకం అమలుకు నోడల్ అధికారులను నియమించడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పేర్ల నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. పథకం విజయవంతానికి ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. మండల స్థాయి, వార్డు అధికారులకు ఎస్‌ఓపీపై శిక్షణ ఇస్తామని చెప్పారు. పేర్ల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ఎంపీడీఓలు, మున్సిపాలిటీలకు ప్రత్యేక లాగిన్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూర్, సీపీఓ వెంకటేశ్వర్లు, ఈడీఎం మహమూద్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాసరచన పోటీల విజేత మౌనిక
బొంరాస్‌పేట: ఎలక్ట్రోల్ లిట్రసిక్ క్లబ్‌లో భాగంగా పదో తరగతి విద్యార్థులకు జిల్లాస్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో దుద్యాల మండలం చిల్మల్‌మైలారం ఉన్నత పాఠశాలకు చెందిన కె.మౌనిక మొదటి బహుమతి సాధించింది. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యత, స్వచ్ఛమైన ఓటరు జాబితా ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహించారు. బుధవారం మౌనికకు కలెక్టర్ దీపక్ బహుమతి అందజేశారు. విద్యార్థినిని పాఠశాల హెచ్‌ఎం యాదయ్య, ఉపాధ్యాయులు అభినందించారు.
అన్ని రంగాల్లో రాణించాలి
అనంతగిరి: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్వీప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల నుంచి 102మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్ ఎంఏ సత్తార్, డీఈఓ అబ్దుల్ ఘనీ, ఇంటర్ విద్య జిల్లా అధికారి శంకర్‌నాయక్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


