అరెస్టు చేయొద్దంటూ పోలీసుల ఎదుట నిందితుడి తల్లి ఆత్మహత్యాయత్నం
నాగోలు: ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి చేసి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని ఎల్‌బీనగర్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్‌బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 19న సంతోష్‌నగర్‌కు చెందిన ఇమ్రోజ్ తెల్లవారుజామున పహాడీషరీఫ్‌కు చెందిన స్నేహితుడు రహ్మత్‌తో కలిసి ఒవైసీ హాస్పిటల్ నుండి ఎల్‌బీనగర్ చౌరస్తా వైపు కారులో వెళుతున్నాడు. ఎల్‌బీనగర్ బస్ స్టాప్ వైపు యు–టర్న్ తీసుకుంటుండగా ఆటోలో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు రహ్మత్‌పై కత్తితో దాడి చేసి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న ఎల్‌బీనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి కర్మన్‌ఘాట్ పరిధిలోని నందనవనానికి చెందిన నవీన్(22)ను గుర్తించి అరెస్టు చేశారు.
పీఎస్‌లో పెట్రోల్ పోసుకుని తల్లి ఆత్మహత్యాయత్నం
తన కుమారుడి అరెస్టు చేశారని తెలుసుకున్న నవీన్‌తల్లి కుటుంబ సభ్యులతో ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌కు గురువారం మధ్యాహ్నం వచ్చింది. పోలీసులను దూషిస్తూ ఆందోళనకు దిగింది. దాడి చేసిన వారందరినీ అరెస్టు చేయాలని, తన కుమారుడి ఒక్కడినే ఎలా అరెస్టు చేస్తారంటూ ప్రశ్నించింది. తన కుమారుడిని అరెస్టు చేయవద్దంటూ స్టేషన్ ఆవరణంలో హంగామా సృష్టించింది. తన కుమారుడిని బయటకు పంపించాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఇన్‌స్పెక్టర్ వెంకటేశం సూచన మేరకు ఆమెను ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో సునీత హంగామా సృష్టించిందని పేర్కొన్నారు.


