అనంతగిరి: వికారాబాద్‌లో చేపట్టిన ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలని శాసనసభ స్పీకర్ జి.ప్రసాద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ దీపక్ తివారి, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. గడువులోపు అందుబాటులోకి తేవాలన్నారు. నాణ్యత పాటించేలా చూడాలని అధికారులకు సూచించారు. రవాణాపరంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణంలో ఆస్తులు కోల్పోయిన వారికి వారం రోజుల్లో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలి
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
కలెక్టర్ దీపక్‌తివారితో కలిసి పనుల పరిశీలన


