న్యూస్‌రీల్
అందరి సహకారం అవసరం
ఆదివారం శ్రీ 25 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
వికారాబాద్: వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. ఎండల తీవ్రత, లోటు వర్షపాతంతో చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. మొత్తం 20 మండలాలకు గాను 16 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. 11 మండలాల్లో తీవ్రమైన కరువు ఛాయలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. బావులు, బోర్లలో నీళ్లు అడుగంటి ఖరీఫ్ పంటలు ఎండిపోతున్నాయి. గతేడాది సెప్టెంబర్ చివరన జిల్లాలో సగటున 5.79 మీటర్ల లోతులో నీరు ఉండగా, ఈఏడాది అక్టోబర్ చివర్లోనే 11.96 మీటర్ల లోతుకు పడిపోయాయి.
ఇదీ పరిస్థితి
● భూగర్భ జలాలు దుద్యాల మండలంలో 25.95, మర్పల్లిలో 24.05, పెద్దేముల్‌లో 15.61 మీటర్ల లోతుకు పడిపోయాయి.
● జిల్లావ్యాప్తంగా నాలుగు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.
● వానాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 738.4 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 475.2 మిల్లీమీటర్లుగా రికార్డయింది.
● రాష్ట్రంలో సగటున 25 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా మన జిల్లాలో 36 శాతం లోటు వర్షపాతం నమోదవడం గమనార్హం.
● మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఎల్‌నినో ప్రభావం మన జిల్లాపైనే అధికంగా ఉంది.
● రాష్ట్రంలో అత్యధిక కరువు ఛాయలు నెలకొన్న గద్వాల తర్వాతి స్థానంలో వికారాబాద్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
● ఖరీఫ్‌లో వేసిన వరి, కంది పంటలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.
● జిల్లాలో 2.19 లక్షల ఎకరాల్లో పత్తి, 95 వేల ఎకరాల్లో కంది, 1.2 లక్షల ఎకరాల్లో వరి, 35 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యాయి. ఇందులో మొక్కజొన్న కోత దశకు రావడంతో ఈ పంటకు ఇబ్బంది లేదు.
● కంది, పత్తి, వరి దిగుబడి 25 నుంచి 50శాతం తగ్గే అవకాశం ఉంది.
రబీపై నీలినీడలు
గతేడాది రబీలో వరితో కలిపి 1.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి ఒక్కటే 90 వేల ఎకరాలకు పైగా ఉంది. ప్రస్తుతం ఈపంట జోలికి వెళ్లకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. నీటి లభ్యత ఆధారంగా జిల్లాలో రబీ సాగు 30 వేల ఎకరాలకు పడిపోయే అవకాశం ఉంది. ఈస్థానంలో స్వల్పకాలిక, ఆరుతడి పంటలు వేసుకోవటం మేలు. శనగ, జొన్నతో పాటు తీగజాతి కూరగాయల పంటలను నాటుకోవాలి.
జిల్లాలో కరువు ఛాయలు
16 మండలాల్లో లోటు వర్షపాతం
అడుగంటుతున్న భూగర్భ జలాలు
మండుతున్న ఎండలు.. ఎండుతున్న పంటలు
నష్టనివారణ చర్యలకు అధికారుల కసరత్తు
జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వివరిస్తున్నాం. ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం డ్రిప్, స్ప్రింక్లర్లు అందిస్తోంది. మల్చింగ్ షీట్లు, డ్రిప్పు, మినీ స్ప్రింక్లర్లు, విత్తనాలు, షేడ్‌నెట్‌లు, రాయితీపై ఇస్తే బాగుంటుందని సిఫారసు చేశాం. గ్రామాలు, పట్టణాల్లో నీటి వృథాను అరికట్టాలి. వర్షపు నీటిని భూమిలో ఇంకించే పనులు పెరగాలి. పంటలకు నీటి వినియోగాన్ని తగ్గించుకుని పశువులు, మనుషుల తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఈనెల 22నుంచి నవంబర్ 30 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. కేతీ బచావో పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి అందరూ సహకరించాలి. – దీపక్‌తివారి, కలెక్టర్, వికారాబాద్ జిల్లా


